ఆయన కంటపడ్డ ఏ ప్రదేశమైనా.. అద్భుతమైన దృశ్యంగా మారాల్సిందే.  ఒక కన్ను మూసి కెమేరా వ్యూ ఫైండర్ లో చూస్తే చాలు.. అది విజువల్ వండర్ అవ్వాల్సిందే. దక్షిణాది తెరమీద ఎన్నో ప్రయోగాలు చేసిన ఏ1 కెమేరా మేన్ ఆయన.  పేరు వి.యస్.ఆర్ స్వామి. ద్విశతాధి చిత్ర ఛాయా గ్రాహకుడు ఆయన. అప్పటి కృష్ణ నుంచి ఇప్పటి ప్రభాస్ వరుకూ దాదాపు అందరు అగ్ర కథానాయకులతోనూ పనిచేసిన అనుభవం ఆయనది. 

వి.యస్.ఆర్.స్వామి  కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, వలివర్తిపాడు గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీపైన మక్కువ ఎక్కువ.  సి.నాగేశ్వరరావు వద్ద అందులోని  మెళకువలు నేర్చుకున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు రవికాంత్ నగాయిచ్ , ఎస్.శంకర్ ల దగ్గర పనిచేశారు స్వామి. వీరాభిమన్యు, బందిపోటు చిత్రాలకు కెమెరా ఆపరేటర్‌గా పనిచేశారు. కృష్ణ నటించిన అసాధ్యుడు చిత్రంతో మొదటి సారిగా ఆయన  ఛాయాగ్రాహకుడయ్యాడు. ఆయన  సినిమాటోగ్రఫీలో ఎన్నో ప్రయోగాలు చేశారు. తెలుగులో అగ్రనటుల చిత్రాలకు ఎక్కువగా ఛాయాగ్రాహకుడిగా పనిచేసింది ఆయనే . తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా సింహాసనంకు ఆయనే ఛాయాగ్రాహకుడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు ఎం.వి.రఘు, ఎస్. గోపాలరెడ్డి, రాం ప్రసాద్ స్వామి శిష్యులే.  తెలుగు సినిమాని సాంకేతికంగా కీలక మైన మలుపు తిప్పిన ఆయన. కలర్, సినిమా స్కోప్, 70 ఎం.ఎం. వంటి ప్రక్రియల్లో తొలినాళ్లలోనే ప్రయో గాలకు శ్రీకారం చుట్టారు. 250 పైగా సినిమాలకు ఛాయాగ్రహణం సమకూర్చారు. మలయాళం మినహా దాదాపు అన్ని భాషల్లోనూ చక్రం  తిప్పారు. ఆయన ఖాతాలో ఎన్నో విలువైన చిత్రాలు ఉన్నాయి. హిందీలో ‘మహాశక్తిమాన్’ అనే త్రీడీ చిత్రం, తెలుగులో ఆపద్బాంధవులు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఎదురీత, కలియుగ స్త్రీ అనే సినిమాలను నిర్మించారు. నేటి ప్రసిద్ధ ఛాయాగ్రాహకులు ఎస్.గోపాల్రెడ్డి, ఎమ్వీ రఘు, శరత్, తదితరులు ఈయన దగ్గర శిష్యరికం చేసిన వారే. కెమెరామన్ గా ఆయన చివరి చిత్రం ప్రభాస్ నటించిన ‘అడవి రాముడు’. నేడు వి.యస్.ఆర్ .స్వామి జయంతి. ఈ సందర్భంగా ఆ ఛాయా మాయావికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!