చిత్రం : విశ్వం
విడుదల తేదీ : 11-10-2024
నటీనటులు : గోపీచంద్, కావ్యా థాపర్, నరేశ్, ప్రగతి, వెన్నెల కిషోర్, వీటీవీ గణేశ్ తదితరులు
సంగీతం : చైతన్ భరద్వాజ్
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, వేణు దోణేపూడి
దర్శకత్వం : శ్రీనువైట్ల
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘విశ్వం’ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమా, టెర్రరిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా హీరోగా గోపీచంద్ కు, దర్శకుడిగా శ్రీనువైట్లకు మంచి బ్రేక్ ఇచ్చిందా లేదా అన్న విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
హైదరాబాదులో కేంద్రమంత్రి (సుమన్) హత్యకు గురవుతాడు. ఆ హత్యను కళ్ళారా చూసిన ఒక చిన్నారిని చంపేందుకు హంతకులు వెంబడిస్తూ ఉంటారు. అయితే ఆ చిన్నారి కుటుంబానికి పరిచయమైన గోపిరెడ్డి (గోపీచంద్) ఆమెను పలుసార్లు ప్రమాదం నుంచి కాపాడుతాడు. కానీ గోపిరెడ్డి వచ్చింది తాను ఇష్టపడిన సమైరా(కావ్య థాపర్) ను కలవడానికి. గతంలో ఇటలీలో పరిచయమైన సమైరాకు దూరమైన గోపిరెడ్డి మళ్లీ ఆమెను కలిసాడా? అసలు గోపిరెడ్డి ఎవరు? ఎందుకు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు? అసలు గోపిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? విశ్వం గోపి రెడ్డిగా ఎందుకు చిన్నారి కుటుంబం ముందుకు వచ్చాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
టెర్రరిజం నేపథ్యంలో ఒక చిన్నారిని కాపాడే కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, కథనంలో కొత్తదనం లేకపోవడం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. శ్రీను వైట్ల తన మునుపటి సినిమాల్లో వాడిన కథాంశాలకు సమానంగా ఈ సినిమా కథ కూడా ఉండటం వల్ల ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందలేరు. గోపీచంద్ తన పాత్రకు న్యాయం చేశాడు. యాక్షన్ సీన్లు, కామెడీ సీన్లలో తనదైన శైలిని ప్రదర్శించాడు. హీరోయిన్ కావ్య థాపర్ తన అందంతో ఆకట్టుకుంది. తన పాత్రకు తగినట్లుగా నటించింది. అలాగే వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్, నరేష్ వంటి సహాయ నటులు తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.
శ్రీను వైట్ల తన మార్కు కామెడీని సినిమాలో పలికించే ప్రయత్నం చేసాడు. అయితే పాత సినిమాల్లోని సన్నివేశాలను రిపీట్ చేయడం వల్ల కొత్తదనం కోల్పోయింది. కథనం బలంగా ఉండాలే కానీ మొత్తం ఒక ఊరికే పరిమితం చేసి తీసినట్టుంది ఈ చిత్రం.
‘విశ్వం’ సినిమా శ్రీను వైట్ల అభిమానులను ఆకట్టుకోవచ్చు. కానీ కొత్తదనం కోసం వెతుకుతున్న ప్రేక్షకులకు ఈ సినిమా నిరాశ కలిగించవచ్చు. శ్రీను వైట్ల తన పాత ఫార్ములాను మళ్లీ వాడటం వల్ల సినిమాలో కొత్తదనం లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. మొత్తంమీద చెప్పాలంటే, ‘విశ్వం’ సినిమా ఒక సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్. శ్రీను వైట్ల మార్కు కామెడీని చూడాలనుకునే వారు ఈ సినిమాను చూడవచ్చు.
ట్యాగ్ లైన్ : పాత సీసాలో కొత్త సారా
రేటింగ్ : 2.25 / 5