విలక్షణమైన నటన.. వైవిధ్యమైన పాత్రలు.. విభిన్నమైన గెటప్పులు .. వింత గొలిపే బాడీ లాంగ్వేజ్ . ప్రతీ పాత్రలోకి పరకాయ ప్రవేశం. తద్వారా ప్రేక్షకుల హృదయాల్లోకి ప్రవేశం . అతడి పేరు విక్రమ్. అభినయం, ఆంగికంతో పాటు ఆహార్యానికి కూడా సమాన ప్రధాన్యతనివ్వడం అతడి స్టైల్. చేసే ప్రతి పాత్ర యొక్క లక్షణాన్ని అవపోసన పట్టి..  ఆ పాత్రలో ఇట్టే ఒదిగిపోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఇంతకాలం అన్ని వైవిధ్యమైన పాత్రల్లో నటించగలిగాడు.

వాణిజ్య ప్రకటనలతో మొదట కెమెరా ముందుకు వచ్చాడు విక్రమ్‌. 1990లో ‘ఎన్‌ కాదల్‌ కన్మణి’ సినిమాతో తమిళ ‘తెరంగేట్రం’ చేశాడు. ఇది లో-బడ్జెట్‌ సినిమా. ఆ తరువాత సి.వి.శ్రీధర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన సినిమా విడుదల అయింది. ఆ తరువాత ‘మీరా’ అనే మరో సినిమాలో నటించాడు. అయితే ఈ మూడు చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ‘బొంబాయి’ సినిమా కోసం మనీషా కొయిరాలాతో మొదట ఫోటో షూట్‌లో పాల్గొన్నది విక్రమే. అయితే, అప్పుడు విక్రమ్‌కి గడ్డం ఉండడంతో దాన్ని తీసేయాలని మణిరత్నం అన్నారు. అయితే, అప్పటికే గడ్డంతో వేరే సినిమా చేస్తోన్న కారణంగా విక్రమ్‌ అందుకు ఒప్పుకోలేదు. అలా ‘బొంబాయి’ సినిమా నుంచి తప్పుకున్నాడు. 1993, 1994 సంవత్సరాలలో సహాయక పాత్రలు చేస్తూ వచ్చాడు. తెలుగులో ‘చిరునవ్వుల వరమిస్తావా’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ‘బంగారు కుటుంబం’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మొదటి కుమారుడి పాత్రలో నటించాడు. ఆ తరువాత కొన్ని తమిళ సినిమాలు చేసినా అవి కూడా విక్రమ్‌ను నిరాశపరిచాయి.  

1997లో నూతన దర్శకుడు బాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సేతు’ సినిమా విక్రమ్‌ కెరీర్‌ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఈ సినిమా విజయం తరువాత విక్రమ్‌ ఎప్పుడు బయటకు వచ్చినా అభిమానులు ఆయనని చుట్టుముట్టేవారు. అలా విక్రమ్‌ కాస్తా ‘చియాన్‌’ విక్రమ్‌గా మారాడు. ఆ తర్వాత పలు చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. కేవలం రెండున్నర సంవత్సరాలలో విక్రమ్‌కు ఐదు విజయాలు సాధించాడు . ఆ తర్వాత సామి, పితామగన్, అన్నియన్ చిత్రాలు విక్రమ్ ను సౌత్ లోనే అగ్ర కథానాయకుణ్ని చేశాయి. నేడు విక్రమ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యపీ బర్త్ డే విక్రమ్..

Leave a comment

error: Content is protected !!