ఆకర్షించే అందం.. ఆకట్టుకొనే అభినయం మెండుగా నిండుగా ఉన్న కథా నాయికలకి అవకాశాలకు ఏమాత్రం కొదవుండదు. అగ్రకథానాయకులతో నటిస్తూ.. స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం ఏమంత కష్టం కాదు. అయితే అలా చేసినా  కొందరికి ఇంకా ఏదో సాధించాలనే తపన, ఏదో చేయాలనే పట్టుదల. అలా అగ్రకథానాయికగా కొనసాగుతూనే .. దర్శకత్వ రంగంలోకి అడుగుపెట్టిన ధీర మహిళ విజయనిర్మల. ఒకటా రెండా ఏకంగా.. 42చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ లోకి ఎక్కి టాలీవుడ్ కే గర్వకారణమయ్యారు ఆమె. తన జీవిత భాగస్వామి సూపర్ స్టార్ కృష్ణ తో ఏకంగా 50 చిత్రాల్లో కథానాయికగా నటించి మరో రికార్డు స్థాపించారు.

‘పాండురంగమహాత్మ్యం’ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసిన విజయనిర్మల.. బియన్ రెడ్డి ‘రంగుల రాట్నం’ చిత్రంలో కూడా ప్రధానమైన పాత్ర పోషించారు…  ఆ తర్వాత పిన్ని, సాక్షి లాంటి మరిన్ని విజయవంతమైన  చిత్రాల్లో కథానాయికగా సత్తా చాటుకున్నారు. 1973లో ‘కవిత’ అనే మళయాళ చిత్రంతో దర్శకురాలుగా మారారు విజయనిర్మల. ఇక తెలుగులో మొదటిసారిగా  ‘మీనా’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించింది. ‘మీనా’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచి విజయనిర్మలకు దర్శకురాలిగా నీరాజనాలు పలికింది. తరువాత మలయాళం లో నిర్మించిన ‘కవిత’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మించారు. విజయనిర్మలకు టెక్నికల్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చిన చిత్రం ‘దేవుడే గెలిచాడు’ సినిమా. తరువాత నుంచి ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగించింది విజయనిర్మల. అక్కినేని-కృష్ణ కాంబినేషన్లో ‘హేమాహేమీలు’, శివాజి గణేశన్‌-కృష్ణ కాంబినేషన్లోలో ‘బెజవాడ బెబ్బులి’, రజనీకాంత్‌-కృష్ణ కాంబినేషన్లో ‘రామ్-రాబర్ట్‌-రహీమ్’ చిత్రాలను డైరెక్ట్‌ చెయ్యడం విజయనిర్మల చేసిన ప్రయోగాలు. మంచి వేగం గల దర్శకురాలిగా పేరుతెచ్చుకున్న విజయనిర్మల తన సినీప్రస్థానంలో 42 సినిమాలకు దర్శకత్వం వహించి అంతకు ముందు ఇటలీ దర్శకురాలు పేరిట వున్న 27 సినిమాల మహిళా దర్శకత్వ రికార్డును తిరగరాసి విజయనిర్మల గిన్నిస్‌ రికార్డును అందుకోవడం గొప్పవిషయం. ఇది కేవలం ఒక తెలుగు మహిళకే సాధ్యమైన విశేషం. ఆమెకు ప్రతిష్టాత్మక ‘రఘుపతి వెంకయ్య’ రాష్ట్ర అవార్డుని ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గౌరవించింది. నేడు విజయనిర్మల వర్ధంతి. ఈ సందర్భంగా ఆమెకు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

  

Leave a comment

error: Content is protected !!