Venky – Anil combo : విక్టరీ వెంకటేష్, హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతోంది. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం.. పొల్లాచి షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్లో వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షితో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు 15 రోజులకు పైగా కొనసాగనుంది. ముక్కోణపు క్రైమ్ డ్రామా కథతో ముస్తాబవుతోంది. వెంకటేశ్ ఈ చిత్రంలో మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు.
దసరా సందర్భంగా ఈ చిత్రం యొక్క టైటిల్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ఈ చిత్రానికి పరిశీలనలో ఉంది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల తర్వాత వెంకీ – అనిల్‌ల నుంచి వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.