చూడచక్కని రూపం.. యువతరాన్ని ఇన్స్ పైర్ చేసే నటన.. ఎప్పుడూ చిరునవ్వును తన పెదవులకు కట్టుకొని.. దానికి కాస్తంత కొంటెతనాన్ని , రవ్వంత చిలిపితనాన్ని అద్ది చెలాకీగా తెరమీద చెలరేగుతాడు. ఆ కుర్రాడి పేరు వరుణ్ సందేశ్. శేఖర్ కమ్ముల స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ ఘన విజయం సాధించింది. అందులోని నలుగురు కథానాయకుల్లో ఒకడిగా వరుణ్ సందేశ్ అందరినీ ఆకట్టుకున్నాడు. తొలి చిత్రమే విజయాన్ని సొంతం చేసుకోవడంతో అతడ్ని వరుసగా అవకాశాలు వరించాయి. దిల్‌రాజు నిర్మాణంలో, శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘కొత్త బంగారులోకం’తో మరో విజయం లభించింది వరుణ్‌కి. అయితే ఆ స్థాయి విజయాల్ని ఆ తర్వాత నుంచి అందుకోలేకయాడు వరుణ్.
కొన్ని పరాజయాల తర్వాత ‘ఏమైందీ వేళ’ లాంటి హిట్టు పడినప్పటికీ వరుణ్ కెరీర్ గాడిన పడలేదు. ‘ఎవరైనా ఎప్పుడైనా’, ‘కుర్రాడు’, ‘మరో చరిత్ర’, ‘హ్యాపీ హ్యాపీగా’ చిత్రాలు ఓ మోస్తరుగా ఆడాయంతే. ఆ తర్వాత చేసిన చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. డి ఫర్ దోపిడి’, ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’ చిత్రాలు కాస్తలో కాస్త ఫర్వాలేదనిపించాయి. ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి మనవడు, ప్రముఖ టీవీ నటుడు జీడిగుంట శ్రీధర్ అన్నకొడుకైన వరుణ్ సందేశ్ అమెరికాలో పెరిగాడు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించాడు. ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల ‘హ్యాపీడేస్’ కోసం ఇచ్చిన ఓ ప్రకటనని చూసి దరఖాస్తు చేసుకొన్నాడు. అందులో ఎంపిక కావడంతో హ్యాపీడేస్‌లో కథానాయకుడిగా నటించాడు. 2015 తర్వాత వరుణ్ నుంచి సినిమాలేవీ రాలేదు. పడ్డామండీ ప్రేమలో మరి’ అనే చిత్రంలో తన సరసన నటించిన కథానాయిక వితిక శేరుతో ప్రేమలో పడిన వరుణ్, ఆ తర్వాత ఆమెని వివాహం చేసుకొన్నారు. 2019 సంవత్సరంలో ‘నువ్వు తోపురా’ అనే చిత్రంలో సందడి చేశారు. ఈ రోజు వరుణ్‌సందేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.