చిత్రం : వకీల్‌ సాబ్‌
నటీనటులు : పవన్‌ కళ్యాణ్, నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌, శ్రుతి హాసన్‌, శరత్ బాబు, ముకేష్‌ రుషి, షియాజీ షిండే, శుభలేఖ సుధాకర్, వంశీ కృష్ణ , అప్పాజీ అంబరీష, నాగ మహేష్ తదితరులు.
సంగీతం : థమన్‌
సినిమాటోగ్రఫీ : పి.ఎస్‌.వినోద్
ఎడిటింగ్‌ : ప్రవీణ్‌ పూడి
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్‌
నిర్మాతలు : దిల్‌రాజు, శిరీష్‌
క‌థ‌ – దర్శకత్వం : శ్రీరామ్‌ వేణు

విడుదల తేది : 09-04-2021

పవన్‌ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్‌ తర్వాత మూడేళ్ల విరామం అనంతరం రీఎంట్రి మూవీగా తెరకెక్కింది ‘వకీల్‌ సాబ్‌’. అందులోను ఈ సినిమా బాలీవుడ్‌, కోలివుడ్ లో బ్లాక్‌ బ్లస్టర్‌ ఐనా ‘పింక్’ సినిమాకి రీమేక్‌ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా..? పవన్‌ కళ్యాణ్ రీఎంట్రి ఇచ్చిన సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం…

 


కథ :

పల్లవి (నివేధా థామస్), జరీనా బేగం (అంజలి), దివ్య నాయక్‌ (అనన్య నాగళ్ళ) వేరు వేరు ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి యువతులు. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ఒకే ఇంట్లో అద్దెకు ఉంటారు. ఆఫీస్ కు వెళ్లడం, వచ్చిన డబ్బులు ఇంటికి పంపిస్తూ… హ్యాపీగా సాగిపోతున్న వారి జీవితంలో ఒక రోజు ముగ్గురు పార్టీ కోసం బయటకు వెళ్లి రాత్రి క్యాబ్‌లో ఇంటికి తిరిగి వస్తుండగా అనుకోకుండా ఎం.పి రాజేందర్‌ (ముఖేష్‌ రిషి) కొడుకు వంశీ (వంశీకృష్ణ) గ్యాంగ్‌తో రిసార్ట్‌కి వెళ్తారు. అక్కడ జరిగిన ఓ సంఘటన ఈ ముగ్గురి జీవితాలను మలుపుతిప్పుతుంది. ఈ ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు అవుతుంది. పోలీసులు పల్లవిని అరెస్ట్‌ చేస్తారు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీకి చెందిన ఈ ముగ్గురు యువతులకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో సస్పెండ్‌ అయిన లాయర్‌ సత్యదేవ్‌ (పవన్‌ కళ్యాణ్) అండగా నిలబడతాడు. అసలు సత్యదేవ్‌ ఎందుకు సస్పెండ్‌ అయ్యాడు? డిఫెన్స్ లాయర్‌ నంద (ప్రకాశ్‌ రాజ్‌)ని సత్యదేవ్‌ ఎత్తుగడలను ఎలా ఢీకొన్నాడు? మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ ముగ్గురి యువతుల కేసును ఎలా గెలిచాడు? అనేదే మిగతా కథ.

కథనం :

ప్రస్తుత సమాజమే కాదు ఎప్పటినుండో మ‌హిళ‌లపై జరుగుతున్న సంఘ‌ట‌నల్ని… వాళ్ల విష‌యంలో స‌మాజం ఎత్తి చూపే ధోర‌ణికి అద్దం పట్టే సినిమా ఇది. అమ్మాయి వేసుకునే బట్టలలోను, తను నవ్వుతూ ఒకరితో మాట్లాడినా లేక ఒంట‌రిగా బ‌య‌టికొచ్చినా మ‌రో వంక‌తో చూసే ధోర‌ణిని సినిమాలో వ‌కీల్‌ సాబ్ (పవన్ కళ్యాణ్) చెప్పే విష‌యాలు ఆలోచ‌నను రేకెత్తిస్తాయి. సినిమాలో ”ఇలా జ‌ర‌గొద్దు… జ‌ర‌గ‌కూడ‌ద‌నే” డైలాగ్ ఓ బ‌ల‌మైన సందేశాన్నిఇస్తుంది. సినిమా నుండి విడుదలైన మొదటి పాట ‘మ‌గువా… మ‌గువా…’ పాట‌తో సినిమా మొద‌ల‌వుతుంది. భిన్న‌మైన కుటుంబాల నుంచి వచ్చిన ముగ్గుర‌మ్మాయిలు న‌గ‌రానికి వచ్చి, ప‌నులు చేసుకుంటూ కుటుంబానికి ఆస‌రాగా నిల‌వ‌డం వంటి స‌న్నివేశాల‌తో ఆ పాట చిత్రీకరణ సాగుతుంది. ముగ్గుర‌మ్మాయిల‌కి ఎదురైన సంఘట‌న‌ల త‌ర్వాత వ‌కీల్‌ సాబ్‌గా ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత వచ్చే స‌త్య‌దేవ్ ఫ్లాష్‌ బ్యాక్ సన్నివేశాలు… ఆ త‌ర్వాత ప‌ల్ల‌వి కేసు కోసం రంగంలోకి దిగి లాయర్‌ నంద (ప్రకాశ్‌ రాజ్‌)ని సత్యదేవ్‌ ఎత్తుగడలను ఎలా ఢీకొన్నాడు వంటి విష‌యాలతో సెకండ్ ఆఫ్ ఆస‌క్తి కరంగా సాగుతుంది.

నటి నటుల పెర్ఫార్మెన్స్ :

వ‌కీల్‌ సాబ్‌ గా ప‌వ‌న్‌క‌ల్యాణ్ బాడి లాంగ్వేజ్, నటన, సినిమా కోసం మూడు వేరియేషన్స్  లో  కనిపించడం, న్యాయం కోసమే పోరాటం చేసే న్యాయ‌వాదిగా ఆ పాత్ర‌లో సహజంగా క‌నిపించారు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో పవన్‌ చెప్పే డైలాగ్స్‌ ఆలోచింపజేసేవిలా ఉంటాయి. సెకండాఫ్ లో అంత సీరియస్ గా సాగుతున్న కోర్ట్ సీన్స్ లో కూడ పవన్ కళ్యణ్ తో అద్భుతమైన కామెడి ని రాబట్టడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సూపర్ వుమెన్ అంటూ సాగే సీన్ ఐతే హైలెట్. వీటి తో పాటు ఫస్టాఫ్ లో నివేదా  పై జరిగే లైంగిక దాడి సీన్ ఐతే మనసు ని కలిచి వేసేదిగా ఉంటుంది. ఈ సినిమా హైలెట్స్ లో డైలాగ్స్ కీలకం. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ కూడా ఈ సినిమాకి కలిసొచ్చిన అంశం. ఐతే సెకండాఫ్ తో పోల్చుకుంటే ఫస్టాప్ కొంచెం స్లో అనే చెప్పాలి, మరి ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం అంత ఆసక్తి కరంగా సాగదు. ఇక శృతిహాసన్‌ తో వచ్చే సీన్‌ లోను పవన్‌ కళ్యాణ్ ఆకట్టుకున్నాడు. నివేదా, అంజ‌లి, అన‌న్య వారి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. నందా పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌ట‌న సినిమాకి ప్రధానాకర్షణ.

సాంకేతిక విభాగం :

ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు ప‌వ‌న్‌ కళ్యాణ్ ఇమేజ్‌ కి త‌గ్గ‌ట్టుగా ఈ క‌థ‌ని తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. త‌మ‌న్ పాట‌లు బ్యాంగ్రౌడ్ మ్యూజిక్ సినిమాని మరో లెవల్ కి తీసుకెళ్ళింది. డైలాగ్ రైటర్ తిరుపతి సంభాషణలు మూవీకి వన్ ఆఫ్ ది హైలెట్. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడ చాల క్రిస్పిగా ఉంటూ అకట్టుకుంటుంది. పి.ఎస్‌.వినోద్ కెమెరా ప‌నిత‌నం సినిమాకి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచాయి. నిర్మాణ పరంగా దిల్ రాజు ఎక్కడ వెనకడుగు వేయకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు , నిర్మాణ విలువలు బావున్నాయి.

చివరిగా : పవన్ సాబ్ ఈజ్ బ్యాక్

రేటింగ్ : 3.5/5

Leave a comment

error: Content is protected !!