చిక్కావే చేతిలో చిలకమ్మా.. ఏదో ఏదో అన్నది ఈ మసక మసక చీకటి.. అనుబంధము ఆత్మీయత అంతా ఒక భూటకం.. నా పక్కన చోటున్నది ఒక్కరికే.. దూపట్లో దూరాకా దూరమేముంది… ఆకాశం దించాలా.. నెలవంక చుంచాలా… శారదా నను చేరదా .. లాంటి పాటలు విన్నప్పుడు వాటిని పాడింది ఘంటసాలేనేమో అనే భ్రమలో ఉంటారు. అయితే మళ్ళీ ఆ పాటల్ని విని నిశితంగా పరిశీలిస్తే .. అర్ధమవుతుంది. వాటిని పాడింది ఘంటసాల కాదు.. అచ్చం ఆయన పాడినట్టుగానే భ్రమింపచేసే వేరే గాయకుడని. ఆయన పేరు విస్సంరాజు రామకృష్ణ దాసు అనే వి.రామకృష్ణ. ఘంటసాల మాస్టారి మరణాంతరం ఆయన ప్లేస్ ను భర్తీ చేసే గాయకుడు ఎవరని మన టాలీవుడ్ సంగీత దర్శకులకు ధర్మ సంకటం ఎదురైంది. అలాంటి టైమ్ లోనే వి.రామకృష్ణ ఘంటసాల కు అల్టర్ నేట్ గా కనిపించారు. వరుస అవకాశాలు వచ్చాయి. వాటిని ఆయన బాగానే సద్వినియోగం చేసుకున్నారు. అగ్రనాయకులు అక్కినేని, ఎన్టీఆర్‌లకు పాటల పాడే గొంతు ఇక లేదేమో అనుకుంటున్న తరుణంలో అభిమానులకు రామకృష్ణ గొంతు ప్రత్నామ్నాయం గా దొరికింది.
1972లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఎస్సీ చదువుతుండగా రామకృష్ణకు అనుకోకుండా పాడే అవకాశం వచ్చింది. కుంటుంబ నియంత్రణ డాక్యుమెంట్రీ చిత్రం కోసం రెండు పాటలు పాడే అవకాశం రామకృష్ణకు దక్కింది. పాటల రికార్డింగు జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న అక్కినేని నాగేశ్వరరావు ఆయన గళం విని, మెచ్చుకుని అన్నపూర్ణ బ్యానర్ మీద నిర్మించబోయే ‘విచిత్రబంధం’ సినిమాలో పాడే అవకాశాన్ని ఇచ్చారు. అలా తొలిప్రయత్నంలోనే అక్కినేని వంటి గొప్ప నటుడికి పాడే అవకాశం రామకృష్ణకు దక్కడం అదృష్ణం. వయసే ఒక పూలతోట… వలపే ఒక పూలబాట’’ రామకృష్ణ సినిమాలో పాడిన తొలిపాట. అందులోనే ‘‘చిక్కావు చేతిలో చిలకమ్మా… నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా’’ అనే సోలో సాంగ్ కూడా పాడారు. ఈ రెండు పాటలూ సూపర్ హిట్టు కావడంతో చిత్రసీమ దృష్టి రామకృష్ణ వైపు మరలింది. రామకృష్ణ దాదాపు రెండు వందల సినిమాలు, ప్రైవేటు గీతాలు కలిపి దాదాపు ఐదువేలకు పైగా పాటలు పాడారు. 1970-80 ప్రాంతాల్లో రామకృష్ణ అక్కినేని, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజులకు తొలిరోజుల్లో ఎక్కువ పాటలు పాడారు. ఒసే వయ్యారి రంగి ఒగలమారి బుంగి, శారదా నను చేరదా; శ్రీమతిగారికి తీరిన వేళా, కృష్ణవేణి తెలుగింటి విరిబోణీ, నీ మనసు నా మనసు ఏకమై, ఒకనాటి మాటకాదు; మధువొలకబోసే, అందాలు కనువిందు చేస్తుంటే, సారీ సో సారీ, కొత్తగా పెళ్లైన కుర్రవానికి, చందమామ రావే జాబిల్లిరావే, ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, ఆకాశం దించాలా నెలవంక తుంచాలా; శివశివ శంకర భక్తవశంకర; ఎన్నియల్లో ఎన్నియల్లో చందమామ.. లాంటివి ఎన్నో. నేడు రామకృష్ణ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.