చూపుతిప్పుకోనివ్వని అందం. చిరునవ్వుకు చిరునామా. నిషా కళ్ళతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టి పడేసిన మగువ. ఆమె పేరు త్రిష. నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ వర్షంలో తడిసిన ఆ వయ్యారి… టాలీవుడ్ లో అందరు అగ్ర కథానాయకుల సరసన మెరిసిన సుందరి. 1999లో మిస్‌ సేలం, మిస్‌ మద్రాస్‌గా ఎంపిక అయింది. ఆ ఒక్కటే కాదు… అనేకానేక పోటీల్లో అందాలరాణిగా విజేతగా నిలచింది. మోడల్‌గా కొన్ని వ్యాపార ప్రకటనల్లో కనిపించింది. ఆపై… సినిమా అవకాశాలపై దృష్టి సారించింది.

1999లోనే త్రిష వెండితెరంగేట్రం చేసింది. ‘జోడి’ సినిమాలో నాయిక సిమ్రాన్‌ స్నేహితురాలిగా చిన్న పాత్రలో కనిపించిన త్రిష అనతి కాలంలోనే అందం, అభినయంతో ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకుంటుందని అప్పట్లో ఎవ్వరూ అనుకోలేదు. కానీ… వృత్తి పట్ల నిబద్దత, పాత్రల ఎంపికలో శ్రద్ధాసక్తులు, వరించి వచ్చిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడంలో అంకిత భావం… ఆపై ఆకట్టుకునే అందం… మిస్‌ స్మైల్‌గా గతంలో పొందిన గుర్తింపునకు రాణింపు అన్నట్లు ఆమె చిత్ర జైత్రయాత్ర సాగింది. 1999లో తెరకు పరిచితమైనా 2002 దాకా సరయిన బ్రేక్‌ రాలేదు. 2002లో ‘మౌనం పసియాదే’ తమిళ చిత్రంలో లీడ్‌ రోల్‌ పోషించిన త్రిష ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస హిట్లతో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఎన్నో అవార్డులు అందుకుంది. పురస్కారాలు, సన్మానాలు స్వీకరించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష చిత్రాల్లో నటించి బహుభాషా కళాకారిణిగా పేరు తెచ్చుకుంది. నేడు త్రిష పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే త్రిష

 

Leave a comment

error: Content is protected !!