ఆయన డైలాగ్.. చిరుగాలిలా సన్నగా మొదలై.. సుడిగాలిలా చెలరేగి.. తుఫానై విజృంభించి .. చివరికి థియేటర్ ను సునామీలా ముంచెత్తుతుంది. కత్తి కన్నాపదునుగా.. నిప్పుకన్నా వేడిగా… ఉండే ఆ పదాల తాకిడికి .. ప్రత్యర్ధులు మాడిమసై పోవాల్సిందే. అలాంటి డైలాగ్స్ ను కోకొల్లలుగా రాసిపడేసి.. టాలీవుడ్ లో పవర్ ఫుల్ రైటర్ గా పేరు తెచ్చుకున్న ఆయన పేరు త్రిపురనేని మహారథి. సినీ రచయితల్లో ఆయనో అతిరథ మహారథుడు.
‘ఎమ్మేల్యే’ సినిమాకి కేబి తిలక్ దగ్గర సహాయకుడిగా చేశారు మహారథి . కె.ఎస్.ప్రకాశరావు, వి.మధుసూదనరావుల సినిమాలకీ పనిచేశారు. మాటల రచయితగా ఆయన ప్రయాణం అనువాద చిత్రంతో మొదలైంది. ఇక యన్టీఆర్ నటించిన ‘బందిపోటు’ త్రిపురనేని తొలి తెలుగు చిత్రం. ఆ తర్వాత ‘సతీ అరుంధతి’, ‘కంచుకోట’, ‘పెత్తందారు’ ఇవన్నీ ఆయనకు రచయితగా తెలుగు చిత్రసీమలో స్థానాన్ని సుస్థిరం చేశాయి. దాదాపు 150 సినిమాలకు సంభాషణలు అందించారు. ఎన్టీఆర్, కృష్ణలతో మహారథికి మంచి అనుబంధం ఉంది. మద్రాసులో అడుగుపెట్టేగానే తొలుత పరిచయమైంది ఎన్టీఆరే. ‘మనదేశం’ కోసం ఎన్టీఆర్ తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు సెట్లో ఎన్టీఆర్‌తో పాటు మహారథి కూడా ఉన్నారు. ఎన్టీఆర్ కలల ప్రాజెక్టుని.. కృష్ణ చేపట్టారు. అదే ‘అల్లూరి సీతారామరాజు’. ఈ చిత్రానికి మహారథి సంభాషణలు అందించారు. ఆ సినిమాతో మహారథికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ సినిమా కోసం ఆయన సంభాషణలన్నీ అడవిలోనే రాశారు. ‘‘తెల్లవారుజామున చలిలో వణికిపోతున్నా ఓ తపస్సులా భావించి.. సంభాషణలు రాశాను. అలా రాస్తున్నప్పుడు నన్ను నేను మరచిపోయాను. కానీ ప్రేక్షకులకు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాను..’’ అని చేప్పేవారు. ఆయనకు రయితగా చివరి చిత్రం ‘శాంతిసందేశం’. నిర్మాతగా ‘రైతు భారతం’, ‘దేశమంటే మనుషులోయ్’, ‘మంచిని పెంచాలి’, ‘భోగిమంటలు’ సినిమాలు తీశారు. అలాగే కృష్ణ ‘సింహాసనం’ చిత్రంలో విలన్స్ లో ఒకరుగా పూర్తి స్థాయి పాత్ర పోషించారు మహారథి. నేడు త్రిపురనేని మహారథి జయంతి. ఈ సందర్భంగా ఆ మహారచయితకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.