సినిమాల్లో వాన పాట అంటేనే ఓ స్పెషల్ కిక్. వెండితెరపై వాన కురవడం, ఆ వానలో హీరో హీరోయిన్స్ తడవడం, ముఖ్యంగా కథానాయిక తెల్లచీర కట్టుకుని తడిసిన అందాలతో మరింతగా మెరవడం, ప్రేక్షకుల మనసులు మురవడం… ఇవన్నీ బాక్సాఫీస్ గల్లాపెట్టె నింపే అంశాలే. అందుకే వాన పాటను తెలుగు సినిమా ఒక కమర్షియల్ ఫార్ములాగా ఎప్పుడో స్వీకరించింది. ఇప్పుడంటే వాన పాటలు తగ్గిపోయాయి గానీ, ఒకప్పుడు చాలా సినిమాల్లో ఈ వాన పాటలు బాగా కిక్ ఎక్కించేవి. ఇప్పటివరకు తెలుగులో వందలాది వానపాటలు పోటెత్తాయి. వాటిల్లోంచి టాప్ 10 సెలెక్ట్ చేయడం అంటే చాలా కష్టమే. కానీ ఇష్టంగా ఈ టాప్ టెన్ రెయిన్ సాంగ్స్ ను సెలెక్ట్ చేశాం. మీరు కూడా ఓ లుక్కేసి ఆ వాన పాటల సోయగంలో తడిసి ముద్దవ్వండి మరి.
1. చిటపట చినుకులు పడుతూ ఉంటే…
ఆత్మబలం (1964) సినిమాలోని ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది. భవిష్యత్తులో ఎన్ని వాన పాటలు వచ్చినా, ఈ వాన పాట స్థానం చెక్కుచెదరదు. ఎప్పటికీ దీనిది నెంబర్ వన్ స్థానమే. వానలో తడుస్తూ ఏఎన్నార్ వేసిన స్టెప్పులు, బి. సరోజా దేవి ముగ్దమనోహర సౌందర్యం ప్రేక్షకుల్ని ఎప్పటికీ హంట్ చేస్తూనే ఉంటాయి. కేవి మహదేవన్ సంగీతం ఆత్రేయ సాహిత్యం ఈ పాటను ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టాయి.
2. ఆకు చాటు పిందె తడిసె…
వేటగాడు (1979) సినిమాలోని సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఇది. ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్లోని మజా ఏంటో ప్రపంచానికి ఈ పాతతోనే తెలిసింది. పదహారేళ్ల వయసు తో మంచి క్రేజ్ తీసుకున్న శ్రీదేవి ఎన్టీఆర్ తో కలిసి నటించే గోల్డెన్ ఛాన్స్ ఈ సినిమాతోనే మొదలైంది. కానీ అందరిలోనూ చిన్న డౌట్. అంతకుముందు బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ కు మనువరాలిగా చేసిన శ్రీదేవిని ఆయన పక్కన హీరోయిన్ గా జనాలు యాక్సప్ట్ చేస్తారా అని… ఈ డౌట్ తోనే ఫాస్ట్ ఈ రెయిన్ సాంగ్ ను షూటింగ్ ప్లాన్ చేశారు. సరిగ్గా అదే టైంకి శ్రీదేవికి ఫుల్ ఫీవర్. కానీ ఎన్టీఆర్ పక్కన నటించే గోల్డెన్ ఛాన్స్ వస్తే, ఎవరు మాత్రం వాడులుకుంటారు… అంత ఫీవర్ తోనూ ఈ రెయిన్ సాంగ్ ను పూర్తి చేసింది శ్రీదేవి. పాత అవుట్ పుట్ అదిరిపోయింది. ఇంకేముంది… హీరోయిన్ గా శ్రీదేవి ఫిక్స్. వేటగాడు హిట్ తో ఎన్టీఆర్ శ్రీదేవి కాంబో సూపర్ హిట్ పెయిర్ అయిపోయారు. ఈ పాటకు చక్రవర్తి స్వరాలు అందించగా, వేటూరి రాశారు.
3. కురిసింది వాన నా గుండెలోనా…
ప్రముఖ హాస్య నటుడు చలం హీరోగా నటించిన బుల్లెమ్మ బుల్లోడు (1972) సినిమాలోని సాంగ్ ఇది. సత్యం స్వరాలు, రాజశ్రీ పదాలు ఈ పాటను చిరంజీవిని చేసేశాయి. ఈ వాటనే ఆ మధ్య వాన సినిమాకోసం దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు రీమిక్స్ చేయించుకున్నారు.
4. వానా వానా వెల్లూవాయే…
చిరంజీవి చాలా రెయిన్ సాంగ్స్ లో నటించారు కానీ వాటిలో ది బెస్ట్ అంటే గ్యాంగ్ లీడర్ (1991) లోని ఈ పాటే అని చెప్పాలి. చిరంజీవి, విజయశాంతి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ముఖ్యంగా డాన్స్ స్టెప్స్, బప్పీలహరి మ్యూజిక్, భువనచంద్ర లిరిక్స్ ఈ పాటను ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలబెట్టాయి. ప్రభుదేవా అప్పుడే కొరియోగ్రాఫర్ గా ఎంటరైన సమయం అది. అతని టాలెంట్ ని చిరంజీవి బాగా ఉపయోగించుకున్నారు. ఇందులో చిరు వేసిన స్టెప్స్ చాలా రొమాంటిక్ గా స్టైలిష్ గా అనిపిస్తాయి. ఈ పాటను ఇప్పుడు చూసిన ఒక ఫీల్ కలుగుతుంది. స్టెప్స్ లో ఎక్కడ స్పీడ్ కనిపించదు చాలా లవ్లీ గా ఉంటాయి. ఇదే పాటను రామ్ చరణ్ తన రచ్చ సినిమాలో రీమిక్స్ చేసుకున్నాడు. రామ్ చరణ్ ఎంత వేగంగా స్టెప్స్ వేసినా, తమన్నా ఎంతలా నడుం ఒంపులు ప్రదర్శించినా, గ్యాంగ్ లీడర్ ముందు తేలిపోయింది.
5. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు…
మామూలుగానే రాఘవేంద్రరావు పాటలు ఒక ఇంద్రజాలంలా అనిపిస్తాయి.ఇక వాన పాట అంటే తిరుగేముంటుంది. చిరంజీవి, వాణి విశ్వనాథ్ లాంటి డ్యాన్సర్స్ దొరికితే, ఆ వాన పాట ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఘరానా మొగుడులోని ఈ సాంగే బెస్ట్ ఎగ్జాంపుల్. పెట్రోల్ బ్యాంక్ సెటప్ తో వాణి విశ్వనాథ్ ను వాటర్ తో తడిపమనే ఐడియా ప్రేక్షకులకు కిక్కేక్కించింది. అపట్లో వాణి విశ్వనాథ్ అన్నీ వాన పాటలే చేస్తుండడంతో, ఆమెను వాన విశ్వనాథ్ అని కూడా సరదాగా పిలిచేవారు అభిమానులు.
6. స్వాతి చినుకు సందెవేళలో…
ఆఖరి పోరాటం (1988) సినిమాలోని పాట ఇది. చాలా పాటలు సిట్యువేషన్ తో సంబందం లేకుండా ఉంటాయి. కానీ ఈ రెయిన్ సాంగ్ ఆ సందర్భానికి బాగా కుదిరింది. నాగార్జున, శ్రీదేవి చాలా బ్యూటీఫుల్ గా సాంగ్ లోడాన్స్ చేశారు. శ్రీదేవి తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్ కు ఈ సినిమాతో శ్రీకారం చుట్టారు.
7. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవేళ….
బంగారు బుల్లోడు (1993) లో బంగారం లాంటి పాట ఇది. ఈ పాటలో బాలకృష్ణకు జోడీగా, పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ నటించారు. రవిరాజా పిన్ని దర్శకత్వంలో జగపతి రాజేంద్రప్రసాద్ నిర్మించారు. జనరల్ గా జగపతి సంస్థ నిర్మించే సినిమాల్లో వానపాటలు బాగుంటాయి. అందుకే ఎంతో ముచ్చట పడి వీబీ రాజేంద్రప్రసాద్ ఈ పాటను చేయించుకున్నారు.
8. చినుకు చినుకు అందెలతో…
మాయలోడు (1993) సినిమాలో సంథింగ్ స్పెషల్ అనిపించే సాంగ్ ఇది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, సౌందర్య హీరో హీరోయిన్లు అయితే పాటను మాత్రం సౌందర్య, హాస్యనటుడు బాబు మోహన్ లపై చిత్రీకరించడం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సౌందర్యతో పోటీ పడి బాబు మోహన్ కూడా స్టెప్స్ బాగా వేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్, జొన్నవిత్తుల లిరికల్ మ్యాజిక్ తో ఈ పాత ఇప్పటికీ పాపులరే. తర్వాత ఈ పాటనే అలీ, సౌందర్య లపై శుభలగ్నం సినిమాలో ఉపయోగించడం విశేషం.
9. జల్లంత కవ్వింత కావాలిలే…
స్టైలిషఫ్ రెయిన్ సాంగ్ అంటే గీతాంజలి (1989) లో ఈ పాట గురించే చెబుతారు ఎవరైనా. గిరిజపై సోలోగా చిత్రీకరించారు ఈ పాటను. ఒక వాన పాటను ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా తీశారు డైరెక్టర్ మణి రత్నం.
10. మెల్లగా కరుగనీ రెండు మనసుల దూరం :
అందరూ వాన పాటలు తీస్తే అగ్ర నిర్మాత ఎమ్మెస్ రాజు ఏకంగా వర్షం పైనే సినిమా తీసేశారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ప్రభాస్, త్రిషలను కలిపేది ఈ వర్షం. ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా అంటూ త్రిష ఒక పాటలో తెగ సందడి చేస్తుంది. ఇక ప్రభాస్,త్రిషలపై చిత్రీకరించిన మెల్లగా కరుగనీ పాత అయితే చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఎస్. గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణ చాతుర్యమే ఈ పాటకు మెయిన్ ఎస్సెట్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఒకెత్తయితే, సిరివెన్నెల సీతాతరామశాస్త్రి సాహిత్యం మరొక ఎత్తు.
అదండీ మన వాన పాటల కథ. ఇవి మాకు అనిపించిన టాప్ 10 మాత్రమే. ప్రతీ ఒక్కరికీ వారి వారి ఇష్టాన్ని బట్టి ఈ ఆర్డర్ మారిపోతుంటుంది. ఏదేమైనా బయట కుండపోతగా కురుస్తున్న వానను చూస్తూ వేడి వేడిగా పకోడి తింటుంటే ఎంత మజా వస్తుందో… ఈ పాటే చూసే ప్రతీసారి కూడా అదే మజా వస్తుంది. కాదనగలమా..!
Article – పులగం చిన్నారాయణ