మచిలీపట్నం , నూజివీడు, పెద ఓగిరాల , ఇంకాస్త పెద్దూరు గుంటూరు తిరిగేస్తూ సినిమాలు చూసేస్తూ … ఆ కథలు నచ్చక సినిమాలు ఇలాంటి కథలతో ఎందుకు తీయరూ అని తనే కథలు రాసేసుకుని … మద్రాసు వెళ్లిపోయిన ఓ పోలీసాఫీసరుగారి అబ్బాయి ఎస్ఎస్ లాల్.
పూర్తి పేరు సయ్యద్ జానీ షహీద్ వలీ లాల్.
ఇహ లాభం లేదని … 1951లో మద్రాసులో తొలిసారి కాలుపెట్టి తిన్నగా కథాశివ బ్రహ్మంగారిని కల్సారు. గురువుగారూ నా దగ్గర చాలా కథలున్నాయి. సినిమా వాళ్లకు కథలు దొరకడం లేదులా ఉంది అవే కథలను తిప్పి తిప్పి తీస్తున్నారు అనేశారు. నీ అభిప్రాయం తప్పురా అబ్బీ … నువ్వు కథ చెప్పినా వాళ్లు వాళ్ల మూసలో ఇది దిగుతుందా లేదా అని చూసుకుంటారు.
అలా చూసుకుని దిగుతుందని నమ్మకం చిక్కాక తీసుకుంటారు. అక్కడనుంచీ వాళ్లే నిన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని రాయించేసుకుంటారు.
తీరా సినిమా రిలీజ్ అయ్యాక … నువ్వు సృష్టించిన పాత్రలే ఉంటాయి తెర మీద … కానీ నువ్వు అనుకునన కథ మాత్రం ఉండదు. ఇందాక నువ్వన్నావే అవే కథల్ని తిప్పి తిప్పి తీస్తున్నారని అదే అభిప్రాయం నువ్వు కథ రాసిన సినిమా చూసినా అనిపిస్తుంది … అని కథాశివ బ్రహ్మం అనిపించుకున్న సదాశివ బ్రహ్మంగారు చెప్పగానే లాల్ కి కళ్లు గిర్రున తిరిగాయి.
స్టోరీ డిస్కషన్స్ అనేది ఎందుకు పెడతారూ అంటే ఇందుకు పెడతారన్నమాట …
అని చాలా క్లియర్ గా చెప్పి ముందు నువ్వు పత్రికల్లో కథలు రాసేందుకు ప్రయత్నించు … వాళ్లు మరీ సినిమా వాళ్లంత కాదు కనుక అక్కడ గుర్తింపు సంపాదించుకుని వస్తే ఇక్కడ కాస్త నీ మాట చెల్లుతుంది అని చెప్పి పంపేశారు బ్రహ్మంగారు.
అలా బ్రహ్మంగారి మాటలు విని తిరిగి వెనక్కి వచ్చేసిన లాల్ గారు గుంటూరు ఏసీ కాలేజీలో చేరిపోయి .. కథలు రాయడం ప్రాక్టీసు చేయడం మొదలెట్టారు.
పత్రికలకు పంపేవారు. కొన్ని కథలు అప్పటి పత్రికల్లో అచ్చు అయ్యేవి. అలా కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నారు. ఆంధ్రపత్రిక నిర్వహించిన పోటీలో బహుమతి కూడా గెల్చారు.
అలా తన మీద తనకు నమ్మకం వచ్చేసిన తర్వాత ఓ ఐదేళ్ల కి అంటే … 56లో తిరిగి మద్రాసులో కాలు పెట్టారు.
నేను కథలు రాస్తాను అని రచయితగా తన చోటు వెతుక్కోడానికి ప్రయత్నం మొదలుపెట్టారు.
ఈ సారి నరసరాజు తదితరులను కల్సారు. ఐదేళ్ల క్రితం సదాశివబ్రహ్మం ఏం చెప్పారో అదే చెప్పారు వీరూను.
ఎలాగైనా సినిమాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న లాల్ గారు … ఇలా లాభం లేదు … కెమేరా విభాగంలో చేరితే బెటరు కదా అనుకున్నారు.
ఎందుకంటే తనకు కెమేరా ఇంట్రస్ట్ చిన్నప్పట్నించీ ఉంది. మంచి స్టిల్ ఫొటోగ్రాఫర్ గా తన బంధు వర్గంలో ఆయనకి ఓ పాపులార్టీ ఉంది. దాన్ని చలన చిత్ర ఛాయాగ్రహణానికి ఎందుకు వాడకూడదు అనుకున్నారు.
అంతే … అలా నిర్ణయించుకున్న తర్వాత రేవతి స్టూడియోలోకి వెళ్లి అక్కడ కెమేరా డిపార్ట్ మెంటు వారితో మాట్లాడారు.
నాకు జీతం వద్దు పని నేర్చుకుంటాను అన్నారు. సరే అని వారు చేర్చేసుకున్నారు.
అలా రేవతిలోకి అడుగు పెట్టిన లాల్ గారు అక్కడ ఎమ్.ఎ రెహ్మాన్ గారి దగ్గర మొదలు పెట్టి సి.నాగేశ్వరరావు, విన్సెంట్ , కమల్ ఘోష్, పిఎల్ రాయ్ లాంటి సీనియర్ సినిమాటోగ్రాఫర్ల దగ్గర పనిచేశారు. పని నేర్చుకున్నారు. జీవితం ఓ దారిన పడింది.
ఇలా జీతం లేకుండా కేవలం ఉత్సాహంతో బతికేస్తున్న ఈ కుర్రాణ్ణి చూసి కెమేరామెన్ సి. నాగేశ్వర్రావుగారికి జాలేసింది. ఇలా లాభం లేదని తను రేవతి స్టూడియోలో చిత్రీకరణకు వచ్చినప్పుడు తనకు అసిస్టెంట్ గా లాల్ కావాలని కోరేవారు.
ఆనాటి నిబంధనల ప్రకారం అలా డిఓపీ కోరిన వారికి జీతం చెల్లించాలి. అలా లాల్ కు అసిస్టెంట్ గా అఫీషియల్ ప్రమోషన్ ఇచ్చి కెమేరా విభాగంలో ఆయన జీవితాన్ని ముందుకు నడిపించిన వారు సి.నాగేశ్వర్రావు. ఆయన కుమారుడే … ఇప్పుడు శేఖర్ కమ్ముల సినిమాలకు పన్జేసే విజయ్ కుమార్ సి.
రేవతి స్టూడియో మూతపడ్డ తర్వాత డబ్ల్యూ ఆర్ సుబ్బారావు అనే డివోపీ తగ్దర చేరి కట్టబొమ్మన్ అనే సినిమాకు పన్జేశారు.
సరిగ్గా అప్పుడే … మోడరన్ స్టూడియోస్ సుందరంగారు ఒక మంచి కెమేరా అసిస్టెంట్ కావాలని సుబ్బారావుగారిని అడిగారు.
ఈయన లాల్ పేరు సూచించి మోడరన్ స్టూడియోస్ లోకి లాల్ ను ప్రవేశపెట్టారు.
మోడ్రన్ స్టూడియోస్ తన పాలిట ఓ యూనివర్సిటీ అనేవారు లాల్ గారు. సుందరంగారు స్వతహాగా కెమేరామెన్ కాకపోయినా కెమేరాకు సంబంధించి చాలా కీలక విషయాలు ఆయనకు బాగా తెల్సు.
సినిమాకు కేమేరాయే కీలకం అనే విషయం సుందరంగారికి తెల్సి ఉండడంతో కెమేరాకు సంబంధించిన బోల్డు పుస్తకాలతో ఓ లైబ్రరీ మెయిన్ టెయిన్ చేసేవారాయన.
దాదాపు పన్నెండు రకాల కెమేరాలుండేవి. ఎల్లిన్ , డంకెన్ లాంటి కెమేరామెన్నులు రాసిన రికార్డ్స్ ఉండేవి.
వీటన్నిటికీ తోడు సుందరం ఇంకో పని చేసేవారు. తన స్టూడియోలో కెమేరా అసిస్టెంట్స్ అందరూ వారానికి రెండు తను చెప్పిన ఇంగ్లీష్ సినిమాలు చూడాలి.
ఆ తర్వాత ఆదివారం రోజు ఆ రెండు సినిమాలకు సంబంధించిన కెమేరా వ్యవహారాలకి సంబంధించి ఓ పరీక్ష పెట్టేవారు.
అందులో పాసైన వారికి ప్రమోషన్స్ ఉండేవి … ఇలా దాదాపు ఓ ఇన్స్ టిట్యూట్ నడిపినట్టు నడిపేవారు ఆయన తన స్టూడియోని.
ఓ సారి ఎస్ఎస్ లాల్ కు కొన్ని కార్టూన్ సినిమాలు చూపించి … వాటికి సంబంధించిన లిటరేచర్ ఇచ్చి నువ్వు మన స్టూడియో వాడుకుని ఓ రెండు నిమిషాల నడివి కథను కార్టూన్లుల్లో తీసి ఇవ్వు అని ఆదేశించారు.
ఈయన తీశారు. అలా కెమేరాకు సంబంధించి లాల్ ను పూర్తిగా మలచినది మోడర్న్ స్టూడియో సుందరంగారే.
చాలా ఏళ్లు మోడర్న్ స్టూడియోలో అసిస్టెంట్ గా పన్జేస్తూ ఇక లాభం లేదని బయటకు పోయి డీవోపీ అవుదాం అనుకుంటున్న దశలో … సుందరంగారు పిల్చి … వల్ల వనుక్కు వలవన్ అనే సినిమాకు కెమేరామెన్ నువ్వే అనేశారు.
అదే లాల్ గారి తొలి సినిమా. తెలుగులో దాన్నే మొనగాళ్లకు మొనగాడుగా తీశారు కనుక తెలుగులో అది తొలి సినిమా.
అలా కథకుడు కావాలని మద్రాసులో కాలు పెట్టిన ఎస్ ఎస్ లాల్ గారు సినిమాటోగ్రాఫర్ గా పాపులర్ అయ్యారు.
తన సోదరుడు ఎస్ డి లాల్ దర్శకుడు కావడంతో ఆయన తీసిన సినిమాలకు పన్జేసే అవకాశం దొరికింది. అలా లాల్ గారి దగ్గరా అదే నిర్మాతలు తీసిన బయట దర్శకుల దగ్గరా కూడా పనిచేశారు.
నిండు దంపతులు , నిండు హృదయాలు, నిండు మనసులు, హంతకులొస్తున్నారు జాగ్రత్త , నిప్పులాంటి మనిషి ఇలా జీవితం దూసుకుపోయింది.
సుందరంగారి పుణ్యాన ట్రిక్ షాట్స్ తీయడంలో నైపుణ్యం అబ్బింది. సిపాయి చిన్నయ్య సినిమాలో ఒక నాగేశ్వర్రావును ఇంకో నాగేశ్వర్రావు చుట్టూ తిరిగి డైలాగ్ చెప్పడం లాంటివి లాల్ కు బాగా పేరు తెచ్చిపెట్టాయి.
ఆ ట్రిక్ ఫొటోగ్రఫీ జ్ఞానమే ఆయన్ని దర్శకుడ్ని చేసింది.
శభాష్ పాపన్న అనే ఓ సినిమా ఆయన డైరెక్ట్ చేశారు. జగ్గయ్య హీరోగా నటించారా సినిమాలో. శ్రీ రామాంజనేయయుద్దం లోనూ ట్రిక్ షాట్స్ ఆయనే తీశారు.
అయితే వీటన్నింటికన్నా సహజంగా ఉండే సినిమాలే తనకు ఇష్టం అనేవారు ఎస్ఎస్ లాల్. అలా ఆయన మనసుకు నచ్చిన సినిమా నీడలేని ఆడది. సహజత్వానికి కాస్త దగ్గర్లో అందదూ కొత్త నటీనటులతో తీసిన ఆ సినిమా తనకు జాబ్ శాటిఫాక్షన్ ఇచ్చిందనేవారు లాల్.
కలర్ సినిమా ఔట్ డోర్ లో తీయడంలోనే కెమేరా దర్శకుడి పనితనం బయట పడుతుందనేవారు. కలర్స్ అంత సహజంగానూ వస్తున్నాయా లేదా ఇలా అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు.
ఒక్కో కెమేరామెన్ కీ ఒక్కో స్టైల్ ఉంటుందని అయితే ఎక్కడా కెమేరా డామినేషన్ కనిపించకుండా నడిపించాలని అప్పుడే ప్రేక్షకులు సినిమాలో లీనమౌతారనీ చెప్పేవారు.
కెమేరా కూడా కథతో పాటూ పాత్రలతో పాటూ నడిచినప్పుడే సినిమా లక్ష్యం నెరవేరుతుందని తన గురువు పి.ఎల్ రాయ్ చెప్పేవారనేవారు లాల్ .
లాల్ గారికి కామ్ గోయింగ్ లాల్ అనే పేరుండేది… ఎవరు ఏది చెప్పినా ఆయన తల ఊపేవారు. వీడేంటి నాకు చెప్పేది అనుకునేవారు కాదు … ఆయన మీద రావికొండల్రావుగారి జోక్ ఉండేది …
అన్నిటికీ ఎస్ ఎస్ అంటారు కనుకే ఆయన పేరు ఎస్ ఎస్ లాల్ అయ్యింది … అని …
కానీ 84లో ఆయన కన్నుమూసినప్పుడు మాత్రం కెఎస్ఆర్ దాస్ గారు విలవిల్లాడిపోయారు. ఆయనకు నచ్చిన కెమేరా దర్శకుడీయన.
స్శశానానికి వెళ్లి వచ్చినా … కూడా ఎస్ ఎస్ లాల్ లేడనే విషయం ఎవరేనా చెప్తే నాకు నమ్మబుద్ది కావడం లేదు అని బాధపడేవారాయన.
కెమేరామెన్ గా స్తిరపడిన తర్వాత కూడా ఆయనలోని రచయిత విశ్రమించలేదు.
గుడిగంటలు మ్రోగాయి అనే టైటిల్ తో లాల్ గారు తయారు చేసిన సినిమా స్క్రిప్టును విజయచిత్రలో ప్రచురించారు.
ఖురాన్ ను తెలుగులోకి అనువదించే పని పెట్టుకుని కొంత చేసిన తర్వాత కన్నుమూశారు.
ఆయన బాటలోనే ఆయన పెద్దకొడుకు కబీర్ లాల్ పెద్ద కెమేరా దర్శకుడు అయ్యాడు. ట్రిక్ షాట్స్ అద్భుతంగా తీస్తాడని పేరు సంపాదించుకున్నాడు తండ్రిలాగే .. అంతకంటే ఏం కావాలి లాల్ గారికి …
టాలీవుడ్ లో సెన్సుబుల్ డీవోపీల్లో లాల్ ముందు వరసలో నిలవదగ్గవాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Writer – Bharadwaja Rangavajhala