Shopping Cart 0 items - $0.00 0

దర్బార్ రివ్యూ

చిత్రం : దర్బార్

నటీనటులు : రజనీకాంత్, నయనతార, నిదేదా థామస్, యోగిబాబు, ప్రతీక్ బబ్బర్, సునీల్ శెట్టి  తదితరులు

సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్

చాయాగ్రహణం : సంతోష్ శివన్

నిర్మాణం  : లైకా ప్రొడక్షన్స్

కథ, స్ర్కీన్ ప్లే దర్వకత్వం : ఎ.ఆర్.మురుగదాస్

రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ తో తెలివైన దర్శకుడెవడూ ప్రయోగాలు చేయడు. అతడి  ట్రేడ్ మార్క్ స్టైట్స్ , మ్యానరిజమ్స్ లాంటి  అన్ని మసాలాలు వండి ప్రేక్షకులకు వడ్డించడమే బెటరని ఫీలవుతాడు. మేకింగ్  జీనియస్ మురుగదాస్ కూడా సరిగ్గా అలాగే అనుకున్నాడు. కాకపోతే రజనీతో  సినిమా చేసే అవకాశాన్ని తొలిసారిగా అందుకున్నాడు కాబట్టి.. ఆయన  పాత్రను అన్ని సినిమాల్లో  మాదిరిగా కాకుండా సమ్ థింగ్ డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవాలనుకున్నాడు. అందుకే దర్బార్ లో రజనీకాంత్ కు ఖాకీ యూనిఫామ్ తొడిగి..  మాస్ జనానికి కావాల్సింది పుష్కలంగా అందించే ప్రయత్నం చేశాడు. ఇంతకీ ఆ ప్రయత్నంలో మురుగదాస్ ఎంత వరకూ సక్సెస్ అయ్యాడో చూద్దాం..

కథ :

ముంబై అసిస్టెంట్  కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్ ) .. అంటే మాఫియాకి దడ. ఎవడైనా తోక జాడిస్తే ముందూ వెనుకా చూసుకోకుండా ఎన్ కౌంటర్ చేసి పడేస్తుంటాడు. ఆ క్రమంలో అక్కడ మీడియా అరుణాచలాన్ని మెంటల్ పోలీస్ అన్నముద్రవేసి మానవ హక్కుల కమీషన్ ముందు నిలబెడుతుంది. అయితే అరుణాచలం ఎంక్వైరీ కమీషన్ నే బెదిరించి.. రిపోర్ట్ తనకు అనుగుణంగా రాసేలా చేస్తాడు. ఇంతకీ ఆదిత్య అరుణాచలానికి ముంబై ని క్లీన్ చేసే పని ఎందుకు పెట్టుకుంటాడంటే..  ముంబై లో చైల్ట్ ట్రాఫికింగ్ , డ్రగ్ మాఫియాకు పాల్పడుతుంటాడు బిజినెస్ మేన్ వినోద్ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రా (ప్రతీక్ బబ్బర్ ).  ఆ కేస్ ను ఆదిత్య అరుణాచలానికి అప్పగిస్తుంది పోలీస్ డిపార్ట్ మెంట్. దాంతో రంగంలోకి దిగిన అరుణాచలం ..థాయ్ ల్యాండ్ లో ఉన్న అతడ్ని ఎంతో తెలివిగా ట్రాప్ చేసి కటకటాల వెనక్కు పంపిస్తాడు. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణాల దృష్ట్యా అతడ్ని కాల్చిపడేస్తారు పోలీసులు. అక్కడే సినిమాలో ఒక ట్విస్ట్ పడుతుంది. ఆ అజయ్ మల్హోత్రా మెవరో కాదు. గతంలో ముంబైలో కొందరు పోలీసుల్ని దారుణంగా దహనం చేసి విదేశాలకు పారిపోయిన హరి చోప్రా (సునీల్ శెట్టి  ) కొడుకని రివీల్ అవుతుంది. మరి హరి చోప్రా తన కొడుకును అరుణాచలం చంపినందుకు  కక్ష్య సాధింపు చర్యకు ఎలా దిగాడు? మరి దానికి అరుణాచలం ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు? అసలు  నివేదా థామస్ కు , రజినీకాంత్ కు సంబంధమేంటి? ఇంకా  నయనతార పాత్ర ఏంటి ?

కథనం , విశ్లేషణ :

కబాలి, కాలా సినిమాల్లో రజనీకాంత్ ను పక్కా ఫ్యామిలీ మ్యాన్ గా చూపించి..  అతడి ఎమోషన్స్ తో ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయాలని చూసి పా.రంజిత్ దెబ్బతిన్నాడు. ఆ కారణంగానే ఏమోగానీ..  పేట సినిమాతో కార్తిక్ సుబ్బరాజ్ .. రజనీకాంత్ ను పాత రజనీకాంత్ లాగానే ప్రెజెంట్ చేసి కొంతలో కొంత మాస్ ప్రేక్షకుల అభిమానాన్నిచూరగొన్నాడు.  ఇక దర్బార్ విషయానికొస్తే.. మురుగదాస్ అసలు ప్రయోగాల జోలికే పోకుండా..  ఒక ఇరవై సంవత్సరాల రజనీకాంత్ ను , అతడి స్టైల్స్ ను ,మ్యానరిజమ్స్ ను మళ్లీ తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో చాలా వరకూ విజయం సాధించాడు.  పాత కథనే తీసుకొని దానికి తన స్టైల్లో ఇంటెలిజెన్స్  స్ర్కీన్ ప్లే ట్రిక్ ప్లే చేశాడు. అది తెరమీద బాగానే పేలింది. ఇక తన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక బర్నింగ్ ప్రోబ్లెమ్ ను ఫోకస్ చేసి..దానికి తనదైన శైలిలో సొల్యూషన్ చూపించే .. మురుగదాస్ దర్బార్ తో చైల్డ్  ట్రాఫికింగ్ , డ్రగ్ మాఫియా మీద ప్రథాన ఫోకస్ చేసి ..తనదైన మ్యాజిక్ చేశాడు.అలాగే..ముంబై హ్యూమన్ ట్రాఫికింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు .  ఇక సినిమా ప్రథమార్ధమంతా రజనీకాంత్  స్టైల్స్, మ్యాజరిమ్స్ , ఫైట్స్ తో మాస్ జనానికి అదిరిపోయే ట్రీట్ ఇచ్చి సన్నివేశాల్ని చకచకా పరుగులు తీయించిన దర్శకుడు .. ద్వితీయార్ధంలో స్ర్కీన్ ప్లే తో మైండ్ గేమ్ తో అలరించాలని చూశాడు. ఆ ప్రయత్నంలో సినిమా కథనం కాస్తంత మందగించింది. ఇక ఓపెనింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ , రైల్వే స్టేషన్ ఫైట్ , సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి.. అలాగే నివేదా, రజనీకాంత్ మధ్య తండ్రీ కూతురు బాండింగ్ ను చాలా ఎమోషనల్ గా చూపించాడు దర్శకుడు.. ముఖ్యంగా హాస్పిటల్ లో నివేదా తండ్రి బెడ్ మీద  బాధగా పడుకొని .. కన్నీళ్లు పెట్టే సీన్  అందరినీ కదిలిస్తుంది.  ఇక క్లైమాక్స్  మాత్రం ప్రెడిక్టబుల్ గా అనిపించి .. అంత గొప్పగా అనిపించదు.  టోటల్ గా దర్బార్ సినిమా రజనీ కాంత్ స్టైల్ తో మాస్ దర్బార్ గా మారిపోయింది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

దర్బార్ సినిమా చూస్తే అసలు రజనీకాంత్   వయసు ఎంత ? అనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతాయి. ఫేస్ లో ముసలి తనపు ఛాయలు ఎక్కడా కనిపించకుండా.. ఒక పాతికేళ్ళకు పూర్వం రజనీకాంత్ ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. డ్యాన్స్ , ఫైట్స్ లో రజినీకాంత్ వేగంగా కదలడం చూస్తే ఆశ్చర్యపడకుండా ఎవరూ ఉండలేరు.  తనదైన శైలిలో డైలాగ్స్ పలుకుతూ.. తన మ్యానరిజమ్స్ తో మాస్ జానానికి పూనకాలు తెప్పించే విధంగా ఆదిత్య అరుణాచలం పాత్రలో చెలరేగిపోయాడు తలైవా. ఇక అతడి కూతురుగా నివేదా థామస్  అద్బుతంగా అభినయించి సినిమాకు అదనపు బలమైంది. అలాగే నయనతార పాత్ర గ్లామర్ పరంగా ఓకే అపించుకుంది. ఇక  విలన్స్ గా ప్రతీక్ బబ్బర్, సునీల్ షెట్టి నటన సాధారణంగానే ఉందనిపిస్తుంది.

సాంకేతిక వర్గం :

దర్బార్ సినిమా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంది. సంతోష్ శివన్ ఫ్రేమ్స్ సినిమాకి ఒక రిచ్ నెస్ తీసుకొచ్చి.. క్వాలిటీ ఔట్ పుట్ వచ్చింది. అలాగే.. అనిరుధ్ సంగీతం .. పాటల్లో సో.. సో అనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దగ్గర మాత్రం తనదైన పనితనం చూపించాడు.  టోటల్ గా టెక్నికల్ విభాగంలో  దర్బార్ సినిమా అదరహో అనిపించింది.

రేటింగ్ : 3.5 

బోటమ్ లైన్ : రజనీకాంత్ మాస్ ‘దర్బార్’

 

 

 

Leave a comment

error: Content is protected !!