పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ కు గట్టి పునాదులు వేసిన చిత్రాల్లో ‘తమ్ముడు’ చిత్రం ఒకటి. పి.ఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన ఈ సినిమా 1999 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఎలాంటి బాధ్యత లేకుండా గాలికి తిరిగే ఒక తమ్ముడు..మంచానపడ్డ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన తన అన్న పరువు కాపాడ్డానికి ..తానూ కిక్ బాక్సర్ గా రంగంలోకి దిగుతాడు. ఇటు అన్న, అటు తండ్రి పేరు నిలపడానికి అతడు పడ్డ తపన ఈ సినిమా ముఖ్యాంశం. కిక్ బాక్సర్ గా పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్ అద్భుతం. రమణ గోగుల సంగీత సారధ్యంలోని పాటలన్నీ అభిమానుల్ని, సామాన్య ప్రేక్షకుల్ని ఉర్రూలూగించాయి. ప్రీతి జింగానియా, అతిదీ గొవిత్రికర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో కిట్టు, అచ్యుత్, మల్లికార్జునరావు, భూపేందర్ సింగ్ , బ్రహ్మానందం, ఆలీ, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమా 1992 లో బాలీవుడ్ లో వచ్చిన జోజితా వహీ సికందర్ సినిమాకి రీమేక్ వెర్షన్. వాస్తవానికి ఆ సినిమా బ్రేకింగ్ ఎవే అనే హాలీవుడ్ మూవీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెరకెక్కించారు. అలాగే తమ్మడు చిత్రం ఆ తర్వాత తమిళంలో విజయ్ హీరోగా ‘బద్రి’గా రీమేక్ అయి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఇక ఇదే సినిమా కన్నడలో ‘యువరాజా’ గానూ, బెంగాలీలో ‘ఛాంపియన్’ గానూ రీమేక్ అయింది.