క్రమశిక్షణ , సమయపాలన నిర్మాణ రంగంలో ఉన్నవారికి చాలా అవసరం. ఇతరులచేత వాటిని పాటింపచేయాలంటే.. ముందు తనకు ఆ లక్షణాలు అలవడాలి. అయితే ఆ లక్షణాల్ని చిన్నానాడే తన తండ్రి నుంచి అవవర్చుకొని ఆయనలాగానే తానూ పెద్ద నిర్మాతగా ఎదిగారు. ఆయన పేరు తమ్మారెడ్డి భరద్వాజ. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి తనయుడే భరద్వాజ.
1979లో సినీరంగ ప్రవేశం చేశారు భరద్వాజ . నిర్మాతగా, దర్శకుడిగా పలు విజయాల్ని సొంతం చేసుకొన్నారు. తండ్రిలాగే కమ్యూనిస్టు భావాలున్న ఆయన చలన చిత్ర వాణిజ్య మండలిలోనూ, నిర్మాతల మండలిలోనూ వివిధ పదవుల్ని అలంకరించి సినీ పరిశ్రమకి సేవ చేశారు. చిత్రసీమలో సమస్యల్ని పరిష్కరించడంలోనూ, కార్మికుల తరఫున పోరాడంలోనూ భరద్వాజ ముందుంటారు. దాసరి నారాయణరావుకి సన్నిహితంగా మెలుగుతూ పలు సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి కథానాయకుడిగా కోతలరాయుడు’, ‘మొగుడు కావాలి’ చిత్రాల్ని నిర్మించి ఆరంభంలోనే విజయాల్ని అందుకొన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ‘మరో కురుక్షేత్రం’, ‘ఇద్దరు కిలాడీలు’ చేశాక ఆయన దర్శకుడిగా మారారు. ‘మన్మథ సామ్రాజ్యం’, ‘అలజడి’, ‘నేటి దౌర్జన్యం’, ‘కడపరెడ్డమ్మ’, ‘శివశక్తి’, ‘నాగజ్యోతి’, ‘ఊర్మిళ’, ‘పచ్చని సంసారం’ తదితర చిత్రాల్ని తెరకెక్కించారు. ‘వన్ బైటు’, ‘దొంగరాస్కెల్’, ‘సింహగర్జన’ తదితర చిత్రాలతో మళ్లీ నిర్మాతగా విజయాల్ని అందుకొన్నారు. ‘వేటగాడు’, ‘అత్తా నీ కొడుకు జాగ్రత్త’, ‘కూతురు’, ‘అత్తా నీ కొడుకు జాగ్రత్త’, ‘స్వర్ణముఖి’, ‘స్వర్ణక్క’ చిత్రాలతో దర్శకుడిగా చేశారు. విజయవంతమైన ‘అంతఃపురం’కి సహనిర్మాతగా వ్యవహరించారు. ‘చివరిగా ప్రతిఘటన అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆ చిత్రం అనుకొన్నస్థాయిలో మెప్పించలేకపోయింది. ‘ఈరోజుల్లో’ చిత్రంలో ఒక చిన్న పాత్రను పోషించిన తమ్మారెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.