Thalapathi 69 : కోలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దళపతి విజయ్, తన కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న చివరి చిత్రం ‘దళపతి 69’ అనేక అంచనాలను రేకెత్తిస్తోంది. కేవీయన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం, నవరాత్రుల సందర్భంగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో ఆత్మీయంగా జరిగిన ఈ పూజా కార్యక్రమం, చిత్ర యూనిట్‌లో ఉత్సాహాన్ని నింపింది. శనివారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుండటం విశేషం.
విజయ్ సరసన పూజా హెగ్డే నాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గౌతమ్ వాసుదేవ మీనన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ ప్రియమణి, వెటరన్ యాక్టర్ ప్రకాష్ రాజ్, రెయిజింగ్ స్టార్ మమిత బైజు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ మరియు అనల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీ వంటి సాంకేతిక విభాగాలు ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చుతున్నాయి.
దాదాపు మూడు దశాబ్దాలుగా వెండితెరమీద విలక్షణమైన నటనతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న విజయ్ కెరీర్‌లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న సినిమా ఇది. దళపతి ఫ్యాన్స్‌కు ఇది ఒక ఎమోషనల్ జర్నీ కానుంది. విజయ్ లెగసీని దృష్టిలో పెట్టుకుని, ఆయన నటిస్తున్న చివరి సినిమాను అత్యంత భారీగా, తరాలు గుర్తుపెట్టుకునేలా తెరకెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్. ‘ధీరన్ అదిగారమ్ ఒండ్రు’, ‘మాస్టర్’ సినిమాలకు పనిచేసిన సత్యన్ సూర్యన్.. దళపతి 69 ని మరో రేంజ్‌లో చూపిస్తారనే కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ప్రేక్షకుల్లో క్రియేట్ అయింది. ప్యాన్ ఇండియా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తమిళ్, తెలుగు, హిందీలో 2025 అక్టోబర్‌లో విడుదల కానుంది ఈ సినిమా.