చూపు చురుకు .. మాట గరుకు .. మనిషి మహా గడుసు. ఆయనకు తెలిసిన భాష ఒకటే. అయినా ఆయన మాట్లాడలేని యాసలేదు. ఏ యాసలో అయినా..  ఆయన  డైలాగ్ పలికితే..  హాలు దద్దరిల్లిపోవాల్సిందే. నవ్వులు విరబూయాల్సిందే. చాలా నిండుగా మాట్లాడతాడు. గలగలా నవ్వుతాడు. ఇటు ఫ్యాక్షనిస్ట్ గానూ, అటు హ్యూమరిస్ట్ గానూ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని నిండుగా మెండుగా పొందిన భోళా మనిషి జయ ప్రకాశ్ రెడ్డి. జేపీ అని ముద్దుగా పిలుచుకొనే ఆయన .. రాయలసీమలో పుట్టాడు. నెల్లూరు లో పెరిగాడు. అనంతపురంలో ఎదిగాడు. ఫ్యాక్షన్ సినిమాల విలనిజానికి పేటెండ్ రైట్స్ తీసుకొని.. తెలుగు తెరమీద చాలా కాలం పాటు చెలరేగిపోయాడు జయప్రకాశ్ రెడ్డి. ఆ తర్వాత కామెడీ చిత్రాల్లో తనదైన శైలిలో నవ్వులు పూయించి..  సత్తా చాటుకున్నాడు.

జేపీ కర్నూలు జిల్లా,  ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివాడు. ఆ తర్వాత అనంతపురం లోని సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. ఆ కారణం చేత.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ జేపీ నాటకాలు ప్రదర్శించి.. ఆయా ప్రాంతాలకు సంబంధించిన యాసల మీద పట్టు సాధించాడు. ఆ ప్రతిభ  కారణంగానే .. 1985 లో రాజశేఖరరెడ్డి అనే దర్శకుడు సుమన్ తో తాను తీస్తున్న ‘కంచుకవచం’ చిత్రంలో డైరెక్ట్ గా విలన్ వేషం వేయించాడు. బ్రూస్లీ ‘ఎంటర్ ది డ్రాగన్’ ఫ్రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన మెయిన్ విలన్ గానే నటించాడు. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో ..  జయప్రకాష్ రెడ్డి తిరిగి స్వస్థలం వెళ్లిపోయారు. అయితే ఒకసారి ఆయన  నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి ప్రముఖ నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశారు. అలా 1988లో విడుదలైన ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు జయప్రకాశ్ రెడ్డి . కానీ 1997 లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం ప్రతినాయకునిగా ఆయనకి  మంచి పేరు తీసుకునివచ్చింది. ఆ తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు. ఆపై కామెడీ పాత్రల్లోనూ , క్యారెక్ట్ ఆర్టిస్ట్ గానూ, వివిధరకాల పాత్రలు పోషించి.. తన వెర్సటాలిటీని ప్రూవ్ చేసుకున్నాడు. నేడు జయప్రకాశ్ రెడ్డి జయంతి . ఈ సందర్భంగా ఆ బహుయాసా  కోవిదుడికి  ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!