అద్భుతమైన అందం.. అందుకు ధీటైన అభినయం… నిండైన విగ్రహం.. విస్పష్టమైన వాచకం.. అనితర సాధ్యమైన నటనాపటిమతో అలరారిన నటశిరోమణి ఆమె. కరుణరసం ఉట్టిపడే పాత్రల్లో , వీరరసం ఉప్పొంగే పాత్రల్లో జీవించడం ఆమెకు ఆమెనే సాటి. ఆమె పేరు పసుపులేటి కన్నాంబ. 1935 నుంచి 1964 వరకు.. అంటే.. దాదాపు 29 సంవత్సరాలు దక్షిణాది చలనచిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన సాటిలేని మేటి నటీమణి కన్నాంబ. ఏకంగా 170 సినిమాల్లో నటించి రాణించింది. అప్పటి సినీరంగంలో కన్నాంబకి అత్యంత ధనవంతురాలని పేరుంది. ఏడువారాల నగలతో ఇంట్లో ఎక్కడ చూసినా బంగారం కనిపిస్తూ వుండేది. మనసు కూడా బంగారం కావడంతో .. ఆమెకు వెండి తెరమీద, నిజజీవితంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి.
కడప వాస్తవ్యురాలైన కన్నాంబ.. 1935 లో వచ్చిన ‘హరిశ్చంద్ర’ చిత్రంలో చంద్రమతి పాత్ర పోషించడం ద్వారా తెలుగు చిత్ర రంగానికి పరిచయం అయ్యారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో .. ఆ తర్వాత సంవత్సరం వచ్చిన ‘ద్రౌపది వస్త్రాపహరం’లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కనకతార, గృహలక్ష్మి, చండిక, ‘వదిన’, ‘చరణదాసి’, ‘ఉమాసుందరి’, ‘తోడికోడళ్ళు’, ‘ఆడపెత్తనం’, ‘శ్రీకృష్ణమాయ’, ‘కార్తవరాయని కథ’, ‘మాంగల్య బలం’, ‘రాజమకుటం’, ‘రేచుక్క-పగటిచుక్క’, ‘అభిమానం’, ‘మాబాబు’, ‘పెళ్లి తాంబూలం’, ‘ఉషాపరిణయం’, ‘లవకుశ’, ‘పరువు-ప్రతిష్ట’ వంటి సినిమాల్లో చక్కటి నటనా పటిమను ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరణకు పాత్రురాలయ్యింది. తెలుగులో కన్నాంబ నటించిన ఆఖరి చిత్రం నాగయ్య నిర్మించిన ‘భక్తరామదాసు’. అందులో రామదాసు భార్యగా కన్నాంబ నటించింది.. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కడారు నాగభూషణాన్ని పెళ్లి చేసుకొని.. సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకొని ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు నిర్మించారు. సినిమా నిర్మాణంలో కష్టనష్టాలు వచ్చినా గాని కన్నాంబ కళాకారులకు, సాంకేతిక సిబ్బందికి టంచనుగా నిబద్ధతతో పారితోషికాలు, జీతాలు అందజేసేవారు. కన్నాంబ దాతృత్వం గురించి ఆరోజుల్లో ఎన్నో కథలు చెప్పుకునేవారు. హాస్యనటుడు పద్మనాభం కూడా మద్రాసులో అడుగు పెట్టినప్పుడు భోజనంపెట్టి, వసతి కల్పించిన సాధ్వీమణి కన్నాంబ. వీరి కంపెనీలో భోజనం చెయ్యని కళాకారుడు ఆ రోజుల్లో వున్నారంటే ఎవరూ నమ్మేవారు కాదు. రాజరాజేశ్వరి దేవిని కన్నాంబ నిష్టతో పూజించేవారు. ఆ దేవి పూజ చేయకుండా షూటింగుకు వెళ్లిన దాఖలాలు లేవు. కన్నాంబ తెలుగులో ఎన్ని సినిమాల్లో నటంచారో.. తమిళంలో కూడా అదే సంఖ్యలో నటించి మెప్పించారు. నేడు కన్నాంబ వర్ధంతి. ఈ సందర్భంగా ఆ మహానటీమణికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.