మనసుగతి ఇంతే.. మనసు మూగది మాటలు రానిది.. మనసు మూగదే కానీ బాసుంటది దానికి చెవులుంటే మనసుకే ఇనిపిస్తుంది ఇది.. మౌనమే నీ భాష ఓ మూగమనసా.. మనసున్న మనుషులే మనకు దేవుళ్ళు… ఇలా మనసు మీద ఫుల్ కమాండ్ , అసలు ఆ పదం మీద పేటెంట్ రైట్స్ ఉన్న గీతకారుడు ఎవరైనా ఉన్నారంటే..  అది ఆచార్య ఆత్రేయనే. మనసు అనే పదానికి అర్ధం వెతికితే.. ప్రతీ  అర్ధంలోనూ ఆత్రేయ మనసు దొరుకుతుంది. అసలు  మనసు’కు కూడా ఓ భాష ఉందని తన పాటలో పల్లవించిన ఘనుడు ఆత్రేయ. అందుకే ఆయనను ‘మనసు కవి’గా కీర్తించారు. ఆత్రేయకు ముందు తరువాత కూడా ‘మనసు’ పదాన్ని తమ పాటల్లో పరుగులు తీయించిన గీతరచయితలు ఎందరో ఉన్నా, అందరిలోకీ ‘మనసు’ పెట్టి పాటలు రాసిన ఆత్రేయ ప్రేక్షకుల మనసులనూ కొల్లగొట్టారు. సందర్భమేదైనా సరే తనదైన మార్కును ప్రదర్శిస్తూ ఆచార్య ఆత్రేయ రచన సాగింది. అందుకే ఆత్రేయ పాటకు తెలుగు జనం సాహో అంటూ సాగిలపడి అభివాదం చేశారు. కిళాంబి వెంకట నరసింహాచార్యులు అనే తన అసలు పేరు ఎవరికీ తెలియకుండా.. నక్షత్రం పేరుతోనే  పిలిపించుకోవడంలో ఆచార్య అయ్యారు ఆత్రేయ.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగళంపాడులో జన్మించారు ఆత్రేయ. 1951లో దీక్ష సినిమాతో సినీరంగ ప్రవేశం చేయడానికి ముందు రంగస్థలానికి ఆయన ఎనలేని సేవచేశారు. సినీరంగంలో కథా రచన, మాటలు, పాటల విభాగాలలో పాలు పంచుకొంటూ ‘‘తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగునీడలు, మూగమనసులు, జయభేరి, పెళ్లికానుక లాంటి ఎన్నో చిత్ర విజయాలలో ప్రముఖ పాత్రను వహించారు. ‘వాగ్దానం’ చిత్రానికి తొలిసారిగా దర్శకతం కూడా చేశారు.  తొలితెలుగు వానపాట ‘‘చిటపట చినుకులు’’ (ఆత్మబలం) ఆయనదే.. వాన పాటలలో అదే ఎప్పటికీ మొదటి స్థానంలో ఉంటుంది. ‘‘చిటపట’’ని చిటాపటా’’ అని సాగదీసి ‘‘చిటాపటా చినుకులతో కురిసింది వాన… మెరిసింది జాణ’’ (అక్కాచెళ్ళెళ్లు) అంటే రాసిన మరో వానపాట కూడా ప్రజాదరణ పొందింది.  హార్ట్‌ స్పెషలిస్ట్‌ కాబట్టి కన్నెపిల్ల గుండెను శోధించి వారి ఆశలను వెలికి తీసే పాటలు ఎన్నారాశారు. ఇక ఆయనకి భక్తి పాటలు రాయడం తక్కువే అయినా రాసినవి ఆణిముత్యాలు. తెలుగు చిత్రసీమలో ఆత్రేయ పాట దాదాపు నాలుగు దశాబ్దాల ప్రయాణం సాగించింది. నాలుగు తరాల నటులకు పాటలు రాసి పరవశింపచేశారు. ఈ తరం సైతం ఆత్రేయ పాటకు జేజేలు పలుకుతోంది. భావితరాలు కూడా ఆత్రేయ పాటతో పరమానందం చెందుతాయి అనడంలో అతిశయోక్తిలేదు. వెయ్యేల, తెలుగు పలుకు ఉన్నంత వరకు ఆత్రేయ పాట మనకు ఆనందం పంచుతూ మనతోనే ఉంటుంది. నేడు ఆత్రేయ శత జయంతి. ఈ సందర్భంగా ఆ మహారచయితకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!