రంగస్థల నట ప్రతిష్టను తెరమీద నిలబెట్టి వెలిగించి కనుమరుగైన నిజమైన నటుడు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. దేశానికి స్వతంత్రం రావడానికి సరిగ్గా రెండేళ్ల ముందు అంటే 1945 అగస్ట్ పదిహేనో తేదీన ఆయన జన్మించారు. 1960 లో అంటే తన పదిహేనోయేట స్టేజ్ మీద కాలుపెట్టారు. కన్యాశుల్కం నాటకంలో ఆడి పేరు తెచ్చుకున్నారు . ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోలేదు.
స్టేజ్ ఆర్టిస్టుగా పరిషత్ నాటకపోటీల్లో రాళ్లపల్లి ఓ సంచలనం. ఆయన సంభాషణల విరుపు ప్రత్యేకంగా ఉండేది. ముఖ్యంగా దిగువ తరగతికి చెందిన జీవిత చిత్రణతో సాగే నాటకాల్లో నటించేప్పుడు ఆయన ఆ సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసేవారు. ఆయన చేసే పాత్రల్లో అది కనిపించేది. ఆయన చేసిన సినిమాల్లోనూ ఆ అధ్యయనం , సహజత్వానికి దగ్గరగా ఉండే నటన కనిపిస్తుంది.
స్టేజ్ మీద వెలుగుతున్న రాళ్లపల్లికి 1970 లో సాంగ్ డ్రామా డివిజన్ లో ఉద్యోగం వచ్చింది. వేతనం రెండువేలు. అలా ఉగ్యోగం చేస్తున్న సమయంలోనే డెబ్బైమూడులో ప్రముఖ దర్శకుడు కె.ప్రత్యగాత్మ నుంచీ పిలుపొచ్చింది. స్త్రీ అనే సినిమాలో కిరాణా వర్తకుడి వేషంలో తొలిసారి రాళ్లపల్లి తెర మీద కనిపించారు. దాదాపు అలాంటి ఆ పాత్రనే ఆ తర్వాత రోజుల్లో నిరీక్షణలోనూ చేశారు.
తెలుగులో కమర్షియల్ సినిమా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో కొత్త ఆలోచనలతో సినిమాలు తీసే ప్రయత్నాలు చేసిన దర్శకుల్లో బి.ఎస్.నారాయణ ఒకరు. అప్పటికే స్టేజ్ మీద బాగా ప్రాచుర్యం పొందిన సి.ఎస్ రావు రచన ఊరుమ్మడి బ్రతుకులు సినిమాగా తీయాలని సంకల్పించారు. అందులో దాదాపు అందరూ స్టేజ్ ఆర్టిస్టుల్నే తీసుకున్నారు అందులో రాళ్లపల్లికి అవకాశం వచ్చింది.
తెలుగు సినిమాకు సంబంధించి అదో అద్భుతమైన సమయం. కుర్ర దర్శకుల చిత్రాలు ప్రారంభమయ్యాయి. స్టేజ్ మీద నుంచీ అద్భుతమైన నటులు తెరంగేట్రం చేశారు. పి.ఎల్.నారాయణ, నూతన్ ప్రసాద్, రాళ్లపల్లి ఇలా ఎవరికి వారు ఏ పాత్ర ఇచ్చినా చీల్చి చెండాడేసేవాళ్లే. నూతన్ ప్రసాద్ కీ రాళ్లపల్లికి ఇద్దరికీ బాగా గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం దేవదాస్ కనకాల తీసిన చలిచీమలు.
రాళ్లపల్లి కేవలం నటుడే కాదు. రచయిత కూడా. మారని సంసారం లాంటి నాటకాలు రాశారు. అలాగే సినిమాల్లో అప్పుడప్పుడూ కామెడీ ట్రాకులూ రాశారు. ఇక ఆయనలో ఉన్న మరోకళ గానం. చిన్నప్పుడు తండ్రి నుంచీ అందుకున్న రామదాసు కీర్తనల గానం తర్వాత రోజుల్లో జానపద గీతాల గాయకుడ్ని చేసింది.
అద్భుతంగా ఆలపించేవారు ఆయన. అలా సినిమాల్లోనూ పాడే అవకాశం చలిచీమలు చిత్రంలో వచ్చింది. సంగీత దర్శకుడు వైద్యనాథన్ సలహా మేరకు రాళ్లపల్లి తన మీద చిత్రీకరణ జరుపుకునే గీతాన్ని తనే పాడేశారు కూడా.
తొలి నాళ్ల లో ఆయనకు ఆర్ధికపరంగా సినిమా పెద్దగా ఉపయోగపడలేదు. ఆయనకు ఆ రోజుల్లోనే రెండువేల రూపాయల వేతనం వచ్చేది. ఊరుమ్మడి బ్రతుకులు చిత్రం కోసం ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ కేవలం ఎనిమిది వందలు. కేటాయించిన సమయం నెల రోజులు. ఆ నెల రోజులూ జీతం కట్ అయ్యింది. అయినా ఓ కొత్త ఏరియాలో జండా ఎగరేయాలంటే ఆ మాత్రం త్యాగం తప్పదనే అనుకున్నారాయన.
సినీనటుడుగా రాళ్లపల్లి జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా తూర్పువెళ్లే రైలు. అందులో హీరోయిన్ బావ పాత్రలో ఆయన నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. సాక్షాత్తు ఆ చిత్ర దర్శకుడు బాపుగారు అన్నమాట … రాళ్లపల్లీ ఈ సినిమా తర్వాత నువ్వు ఉద్యోగం చేసుకోలేనన్ని ఆఫర్లు నీకు రాకపోతే నేనే దర్శకత్వం మానేస్తానయ్యా అని. అంతటి ముద్ర వేసిందా సినిమా.
రాళ్లపల్లి తెలుగు తెర మీద విలక్షణమైన కమేడియన్. ఆయన కేవలం హాస్యపాత్రలే కాదు … విలనీ చేయగలడు. కారక్టర్ రోల్స్ లోనూ మెప్పించగలడు. ఏ పాత్రలోకైనా పరకాయప్రవేశం చేయడమే కాదు … పూర్తి గా దాన్ని చీమునెత్తురులతో నింపేసి నటించడం రాళ్లపల్లి ప్రత్యేకత. జంధ్యాల దర్శకత్వం వహించిన శ్రీవారికి ప్రేమలేఖలో ఆయన మాట్లాడుకోవడం మీద చెప్పే క్లాసు మామూలుగా ఉండదు.
రాళ్లపల్లితో గుర్తుండిపోయే పాత్రలు చేయించుకున్న దర్శకుల్లో బాపు తర్వాత జంధ్యాల వంశీలు ముందుంటారు. దాదాపు జంధ్యాల ఆ రోజుల్లో తీసిన అన్ని సినిమాల్లోనూ రాళ్లపల్లికి చోటుండేది. ఆయనకో విచిత్రమైన మేనరిజం పెట్టేసి వదిలేసేవారు జంధ్యాల. దాన్ని అద్భుతంగా రక్తి కట్టించేసి వదిలేవారు రాళ్లపల్లి. రెండు రెళ్లు ఆరులో పుచ్చాపూర్ణానందం గారి కాంబినేషన్ లో రాళ్లపల్లి చేసే హడావిడి అంతా ఇంతా కాదు.
జీవితాన్ని బాగా చదివితేనేగానీ అన్ని రకాల పాత్రలనూ చేసి మెప్పించడం కుదరదు. ఒక రకంగా నటన అనేది సామాజిక శాస్త్రం. విలనీ చేస్తే ఆ కుత్సితత్వం గురించిన సమగ్ర దర్శనం నటుడులో ఉంటేనేగానీ దాన్ని పండించడం కుదరదు.
రంగస్థలం నుంచీ వచ్చిన ప్రతి ఒక్కరిని తన సోదరుడుగానే భావించేవారు రాళ్లపల్లి. వారికి ఆర్ధిక సాయం చేయడం భోజనం పెట్టించడం లాంటి సహాయాలన్నీ చేయడం తన బాధ్యతగా ఎంచేవారు. అలా వ్యక్తిగా కూడా చాలా ప్రభావవంతమైన శీలం ఆయనది. ఆయన సహాయసహకారాలతో నటుడైన రచయిత తనికెళ్లభరణి రాళ్లపల్లి ని తన గురువుగా బావిస్తారు.
అబ్బూరి రామకృష్ణారావు ప్రోత్సాహంతో కన్యాశుల్కంలో కరటకశాస్త్రి పాత్రతో ప్రేక్షకాదరణ పొంది రంగస్థల సినీ నటుడుగా జండా ఎగరేసిన రాళ్లపల్లి దాదాపు ఓ దశాబ్దరన్నర కాలంగా నటనకు విరామమిచ్చారు. దర్శకుడు తేజా తీసిన జయం సినిమాలో ఆయన నటించారు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలు తగ్గించుకున్నారు. ప్రశాంత జీవనం గడుపుతూ వచ్చారు.
అనంతపురం జిల్లా కంబదూరు గ్రామంలో ప్రారంభమైన రాళ్లపల్లి ప్రస్తానం హైద్రాబాద్ లో ముగిసింది. వయోభారం కారణంగా అనారోగ్యానికి గురైన ఆయన ఆసుపత్రిలోనే కన్నుమూశారు. రాళ్లపల్లికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి పెద్ద చదువులు చుదువుతూ రష్యా వెళ్లి అక్కడే అనారోగ్యానికి గురై కన్నుమూశారు. అదే రాళ్లపల్లి జీవితంలో విషాదం.
నటుడుగా తెలుగు రంగస్థలం మీదా వెండితెర మీదా రాళ్లపల్లి వేసిన ముద్ర అసామాన్యం. అనేక మంది నటులకు ఆయన ప్రేరణ. నటుడు అనే ప్రతి ఒక్కరికీ ఆయన సోదరుడే. ఎవరికైనా ఏ సహాయం అందించడానికైనా ముందుంటారు రాళ్లపల్లి.
writer – Bharadwaja Rangavajhala