మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అభిమానులు ఎప్పుడూ మరిచిపోలేని చిత్రం ‘ఠాగూర్’. 2003, సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. వివివినాయక్ దర్శకత్వంలో బి.మధు నిర్మించిన ఈ సినిమాకి థ్రిల్లింగ్ సీన్స్, గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే హైలైట్స్. అభిమానులకు కావాల్సిన అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండడం ఈ సినిమా ప్రత్యేకత. ఒక కాలేజీ ప్రొఫెసర్ తన పూర్వ విద్యార్ధుల సహాయంతో ప్రభుత్వ కార్యాలయాల్లోని లంచగొండుల భరతంపట్టి.. అవినీతిని అంతం చేయడమే ప్రధాన లక్ష్యంగా చేసుకుంటాడు. మన పర అనే బేధం లేకుండా ఒకో అవినీతి పరుణ్ణి కిడ్నాప్ చేసి వాళ్ళను హత్య చేస్తూంటాడు. ఆ క్రమంలో జరిగే పరిమాణాలు మిగతా కథ. ఇందులో ఠాగూర్ గా చిరంజీవి అభినయం, డ్యాన్స్ , డైలాగ్స్ అభిమానుల్ని వెర్రెత్తించేయి. మణిశర్మ సంగీతంలోని పాటలు ఇప్పటికీ అభిమానుల్ని అలరిస్తూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో త్రిష, జ్యోతిక కథానాయికలుగా నటించగా.. కె.విశ్వనాథ్, పునీత్ ఇస్సార్, షియాజీ షిండే, సుధాకర్ నాయుడు, హేమంత్ రావణ్, ప్రకాశ్ రాజ్, రమాప్రభ, యం.యస్.నారాయణ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమా 2003లోనే తమిళంలో వచ్చిన ‘రమణ’ సినిమాకి రీమేక్ వెర్షన్. విజయ్ కాంత్ హీరోగా నటించిన ఈ సినిమాని మురగదాస్ డైరెక్ట్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇదే సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా ‘విష్ణుసేన’ గా రీమేక్ అయింది. అలాగే హిందీలో క్రిష్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ గా రీమేక్ అయింది.