నవ్య సిద్దాంత ప్రతిపాదకుడు, తత్వవేత్త, విప్లవావాది, రచయిత, విమర్శకుడు, సినిమా కవి తాపీ ధర్మారావు నాయుడు. ఆయన్ను తాతాజీ అని కూడా పిలుస్తారు. ఒకప్పటి ప్రముఖ దర్శకుడు తాపీ చాణక్య ఆయన కుమారుడే. 20వ శతాబ్దపు మేధావులలో ప్రసిద్ధులు. తొలుత గ్రాంధిక భాషావాదియై గురజాడ, గిడుగును తీవ్రంగా విమర్శించిన తాపీ, తర్వాత తమ అభిప్రాయం తప్పని గ్రహించి గిడుగు జాడల వ్యావహారిక భాషా సిద్ధాంతాన్ని ఎంతో పైకి తెచ్చారు. తాపీ ధర్మారావు 1887 సెప్టెంబరు 19న నేటి ఒడిషాలోని బరంపురంలో జన్మించారు. బరంపురం, విజయనగరం, మద్రాసు పచ్చయప్ప కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. గణిత శాస్త్రంలో పట్టభధ్రులయ్యారు. బరంపురం, విశాఖపట్నంలో లెక్కల మాస్టారుగా పనిచేశారు. తర్వాత చుండి, మందస, దక్షిణ నెల్లూరులో జమిందారీల ట్యూటర్‌గా ఉన్నారు. కొన్నాళ్లు బొబ్బిలి మహారాజుకు సెక్రటరీగా ఉన్నారు.
బరంపురంలో ఉండగానే ”వేగుచుక్క గ్రంథమాల” స్థాపించి పుస్తక ప్రచురణ ప్రారంభించారు. తొలుత ఎన్నో కలం పేర్లతో రాసేవారు. అలా రాసిన వాటిలో ”వాడే వీడు” అనే డిటెక్టివ్ నవల బహుళ వ్యాప్తి చెందింది. తర్వాత ఆంధ్రసాహితీ సమాజాన్ని నెలకొల్పారు. 1949లో ఆయన స్థాపించిన ‘జనవాణి’ పత్రిక ఆయన పేరును నలుమూలలా వ్యాపింపజేసింది. ఆంధ్ర రాష్ట్ర పత్రికా సంపాదకుల మహాసభకు ఆయనే తొలి అధ్యక్షులు. ‘రాగిడబ్బు’, పాతపాళి, ఆంధ్రతేజం, మబ్బుతెరలు ఆయన రాసిన ఖండకావ్యాలు. కొత్తపాళి, సాహిత్య మొర్మొరాలు, ఆలిండియా అడుక్కు తినేవాళ్ల మహాసభ, ‘చొప్పదంటు ప్రశ్నలు’ ఇలా ఎన్నో శీర్షికలలో వ్యంగ్య హాస్య ప్రధానమైన వ్యాసాలు రాశారు. తాపీ ధర్మారావుకు సినిమారంగంతో మొదటి నుంచీ సంబంధం ఉంది. గూడవల్లి, బిఎన్ రెడ్డి ఆయనకు మొదటి నుంచీ మంచి మిత్రులు. తాపీ ధర్మారావు 40 సినిమాలకు మాటలు, పాటలు రాశారు. సారధీ వారి మాలపిల్ల , రైతుబిడ్డ , స్వతంత్రావారి ‘ద్రోహి’ , శోభనాచలవారి కీలుగుర్రం , బిఎయస్ వారి పల్లెటూరి పిల్ల , దీక్ష , సాహసం , టింగురంగా మొదలగు చిత్రాలు ఆయనకెంతో పేరు తెచ్చాయి. ఆయన రచన చేసిన చిత్రాలలో ఎక్కువ భాగం విప్లవాత్మకమైనవే. ఉత్సాహవంతులైన యువకులను ఆయన ప్రోత్సహించేవారు. ”బ్రదర్ ఒక మంచి యువకుడు ‘పల్లెటూరి పిల్ల’లో నటిస్తున్నాడు, నీ వద్ద బాగా రాణీస్తాడు” అని బిఎన్. రెడ్డికి తాపీ ధర్మారావే యన్‌టి రామారావును గూర్చిచెప్పి ‘మల్లీశ్వరి’లో బుక్ చేయించటం జరిగింది. వివిధ రంగాలలో కృషిచేసిన తాపీ ధర్మారావు నిజంగా ప్రజ్ఞానిధి, ధన్యజీవి. నేడు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆ మహారచయితకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.