కళ్ళలో క్రోధం.. చూపులో లౌల్యం.. మాటలో గాంభీర్యం.. మనసులో కరుణం నింపుకున్న నటుడాయన. డైలాగులో పలకడంలో విరుపు.. ఆ విరుపులో ఒడుపు.. ఆయన సిగ్నేచర్. నాటక రంగం నుంచి సినీ రంగానికి వచ్చి.. దక్షిణాది ప్రేక్షకుల్ని తనదైన అద్భుత నటనతో మంత్ర ముగ్ధుల్ని చేసిన నటయశస్వి ఆయన. పేరు సామర్ల వెంకట రంగారావు అనే యస్వీ రంగారావు. దాదాపు 300 చిత్రాలకు పైగా నటించగా.. వాటిలో జానపదాలు, పౌరాణికాలు, చారిత్రకాలు, సాంఘికాలు వున్నాయి. కుటుంబకథా చిత్రాలే కాదు, అనేక యాక్షన్ చిత్రాల్లో కూడా రాణించిన రంగారావు తొలి సినిమాలో నటించడానికి అనేక ఇబ్బందులు, ఆటుపోట్లతోబాటు అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. ఆయన తదనంతరకాలంలో పాత్రలను మించి ఎదిగి నటించారు. రౌద్రం, వీరం, అద్భుతం, కరుణ రసాలను అలవోకగా పండించిన మహనీయుడు యస్వీఆర్.
యస్వీఆర్ కు చిన్నతనం నుంచీ నాటకాలంటే పిచ్చి. ఆ వయసునుంచి తాను సినిమా నటుడు అయ్యేవరకూ ఉన్న గ్యాప్ లో ఎన్నో నాటకాల్లో నటించి, అపారమైన అనుభవం సంపాదించారు. ఆ దశలోనే తలవని తలంపుగా రంగారావు జీవితం ఒక మలుపు తిరిగింది. రంగారావు సమీప బంధువు బి.వి.రామానందం ‘వరూధిని’ అనే సినిమా నిర్మిస్తూ అందులో రంగారావుకి ప్రవరాఖ్యుడి వేషం ఇచ్చారు . తొలిరోజు నుంచే ఈ సినిమాకు ఫ్లాప్ ముద్రపడింది. దాంతో రంగారావుకు సినిమా అవకాశాలు రాలేదు. మరలా ఉద్యోగం వెదుక్కుంటూ జంషెడ్పూర్ వెళ్లి టాటా స్టీల్ ఫ్యాక్టరీలో గుమాస్తా ఉద్యోగంలో చేరారు. రెండేళ్లపాటు అక్కడే వుండిపోయారు. అప్పుడే విజయా సంస్థ నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి తొలిప్రయత్నంగా ‘షావుకారు’ చిత్రాన్ని నిర్మిస్తూ ఎన్.టి.రామారావును ఘంటసాలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. అందులో సున్నం రంగడి పాత్రకు సదాశివరావును తీసుకోవాలని భావించినా దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ మాత్రం ఎస్.వి.రంగారావును ప్రతిపాదించారు. అలా రంగడిపాత్ర రంగారావుకు దక్కింది. విజయావారు తెలుగు, తమిళంలో నిర్మించిన రెండవ చిత్రం ‘పాతాళభైరవి’లో నేపాళ మాంత్రికుడి పాత్ర రంగారావు వశమై, చరిత్ర సృష్టించి నటుడిగా నిలబెట్టింది. ఈ పాత్రతో రంగారావుకు సినిమా నటులలో మహోన్నత స్థానం, అసంఖ్యాకులైన ప్రేక్షకుల అభిమానం లభించాయి. ఆ తర్వాత మాయాబజార్ లో ఘటోత్కచుని పాత్ర ఆయన్ను ఉన్నత శిఖరంపై నిలబెట్టింది. తరవాతి రోజుల్లో ‘అనేక పౌరాణిక, జానపద పాత్రలు సమర్ధవంతంగా పోషించారు. ఇక ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘నమ్మినబంటు’, ‘దేవాంతకుడు’, ‘గాలిమేడలు’, ‘మురళీకృష్ణ’, ‘మాంగల్యబలం’, ‘తోడికోడళ్ళు’, ‘వెలుగునీడలు’, ‘గుండమ్మ కథ’, ‘చిలకా గోరింక’, ‘రాము’, ‘మంచిమనసులు’, ‘బందిపోటు దొంగలు’, ‘పండంటికాపురం’ వంటి ఎన్నో సాంఘిక చిత్రాలలో వైవిధ్యమైన నటనే కాకుండా, పాత్రోచితమైన నటనను ప్రదర్శించి మన్నన పొందారు. రంగారావు నటించిన ‘తాత-మనవడు’ చిత్రం దాసరి నారాయణరావుకి దర్శకుడిగా మంచి పేరుతెచ్చిపెట్టింది. రాజ్యం పిక్చర్స్ వారు నిర్మించిన ‘నర్తనశాల’ చిత్రంలో రంగారావు కీచకుడిగా నటించారు. ఆ పాత్ర వుండేది కేవలం 15 నిమిషాలు మాత్రమే. కానీ, ఆ పాత్రలో జీవించి నటించిన రంగారావుకు భారత రాష్ట్రపతి బహుమతి లభించింది. జకార్తా ఫిలిం ఫెస్టివల్‌లో రంగారావు నటనకు అబ్బురపడి, ఉత్తమ నటుడుగా అంతర్జాతీయ బహుమతి ప్రదానం చేశారు. నేడు యస్వీరంగారావు వర్ధంతి. ఈ సందర్భంగా ఆ నట యశస్వికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.