సుత్తి వీర‌భ‌ద్ర‌రావు డెబ్బై ద‌శ‌కం చివ‌ర్లో వెండితెర మీద కాలుపెట్టిన అద్బుత‌మైన న‌టుడు. ఆకాశ‌వాణి ద్వారా ప్ర‌జ‌ల‌కు తెల్సిన వీర‌భ‌ద్ర‌రావును సుత్తి వీర‌భ‌ద్ర‌రావును చేసిన ఘ‌న‌త జంద్యాల‌దే.
మాదాల రంగారావు ఎర్ర‌మ‌ల్లెలు సినిమాలో లాయ‌రుగా క్ల‌యింట్ల‌ను చావ‌గొట్టిన వీర‌భ‌ద్ర‌రావు విల‌నీ కూడా బాగా పండించ‌గ‌ల న‌టుడే. అయితే ఆయ‌న‌కా అవ‌కాశాలు రాకుండా చేశారు జంధ్యాల‌.
జంధ్యాల రెండో సినిమా మ‌ల్లెపందిరి ఆడ‌లేదు. ఆ త‌ర్వాత సినిమా నాలుగు స్థంభాలాట‌. న‌వ‌తా కృష్ణంరాజుగారు నిర్మాత‌.
జంధ్యాల అద్భుత‌మైన కామెడీ ట్రాకు న‌డిపారా సినిమాలో. న‌వ్వినా ఏడ్చినా క‌న్నీళ్లే వ‌స్తాయి అని ఆత్రేయ రాస్తే జంధ్యాల నిరూపించాడు.
నాలుగు స్థంభాలాట‌లో ఒక వైపు సుత్తి జంట వీర‌భ‌ద్ర‌రావు, వేలు న‌వ్వించి ఏడిపిస్తే … పూర్ణిమ, తుల‌సి ఏడిపించి క‌న్నీళ్లు తెప్పించారు. ఫైన‌ల్ గా సినిమా చాలా పెద్ద హిట్ కొట్టింది.
క‌పిల్ దేవ్ అంటే ఎవ‌రు ? క‌పిల‌వాయి దేవుడమ్మ అని మ‌న‌వాడు మ‌న బంద‌రు బ‌చ్చుపేట కుర్రాడు. వాడేదో క‌ర్రాబిళ్లా ఆడుతుంటే ఏమిటో అనుకున్నా ఆ త‌ర్వాత పెద్దోడై పోయి క‌పిల్ దేవ్ అని పేరు మార్చేసుకున్నాడు అన్నంత‌గా తెలుగు ప్ర‌జ‌ల‌ను ఇన్ఫులెన్స్ చేసిన క‌మేడియ‌న్ వీర‌భ‌ద్ర‌రావు.
నీ బోడి స‌ల‌హా విన‌డం వ‌ల్లే మా కొంపిలా బూజుప‌ట్టిన ఆవ‌కాయ‌జాడీలా త‌యార‌య్యింద‌ని ఆయ‌న అన‌బ‌డ్డే పేలింది.
క‌వీ తెర లెగుసుద్ది. అప్పుడు ఈరో ఈరోయిన్నూ మంగ‌ళ‌గిరి తిర‌నాల‌కెళ్తారు. ఆడ పిల్లోడు త‌ప్పిపోతాడు. అప్పుడాళ్లు ఆ పిల్లాణ్ణి ఎతుక్కుంటా బెజ‌వాడొచ్చి … గాంధీన‌గ‌ర‌మూ, మారుతీన‌గ‌రూ , మాచ‌వ‌రం డౌనూ , గుణ‌దల , రామ‌వ‌ర‌ప్పాడూ , ప్ర‌సాదంపాడూ ఇలాంటి తీగ‌పాక‌పు డైలాగుల‌తో మ‌న్ని న‌వ్వించీ న‌వ్వించీ ఫైన‌ల్ గా ఏడిపించి చాలా తొంద‌ర‌గా వెళ్లిపోయాడు వీర‌భ‌ద్ర‌రావు.
తారీకులు ద‌స్తావేజులు అవి కాదోయ్ చ‌రిత్ర‌కు అర్ధం అన్నాడు శ్రీశ్రీ. నిజ‌మే … వీర‌భ‌ద్ర‌రావు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు మ‌న్ని వ‌దిలేసి వెళ్లిపోయాడు అనేది కాదుగానీ ఉన్నంత కాలం మ‌న్ని న‌వ్వించాడు. మ‌న న‌వ్వుల్లో చిరంజీవిగా బ్ర‌తికుంటాడు.
చాలా సీరియ‌స్ గా ఫేసు పెట్టి … ఎవ‌డు ఎవ‌డు నేను ఇంట్లో వంట చేస్తాన‌ని చెప్పిన త్రాష్టుడెవ‌డు అంటూ చొక్కాచింపేసుకుని తానేడుస్తూ న‌వ్వించేసిన మోస్ట్ పాపుల‌ర్ హాస్య న‌టుడు వీర‌భ‌ద్ర‌రావుకు నివాళి.

Writer – Bharadwaja Rangavajhala

Leave a comment

error: Content is protected !!