‘నవ్వు నాలుగు విధాల చేటు’ అన్నవారి నెత్తిమీద తన సుత్తి తో గట్టిగా మోది.. కాదు, నవ్వు నలభై విధాల గ్రేటు అని నిరూపించిన గొప్ప హాస్యనటుడు ఆయన. చూడగానే నవ్వొచ్చే ముఖం.. వినగానే పడిపడి దొర్లే కామెడీ టైమింగ్ .. డైలాగుల విరుపు.. ఆపై ఆయన తిట్టే విచిత్రమైన తిట్లు .. సుత్తి పోట్లు అప్పటి ప్రేక్షకులకి భలే వినోదాన్ని అందించాయి. ముఖ్యంగా ఆయన జంధ్యాల చిత్రాలకు ఆస్థాన హాస్యనటుడు అవడంతో ఆ సినిమాల్లో ఆయన పండించిన హాస్యం.. నవ్వించిన నవ్వులు ప్రేక్షకుల హృదయాల్లో ఇంకా పదిలంగా అలాగే ఉన్నాయి. ఆయన పేరు మామిడిపల్లి వీరభద్రరావు. జంధ్యాల చిత్రాల్లోకి అడుగుపెట్టాకా.. అందులోనూ ‘నాలుగు స్థంభాలాట’లో నటించాకా ఆయన సుత్తి వీరభ్రదరావు అయిపోయారు. మరో హాస్యనటుడు వేలుతో పండించిన ఆయన హాస్యం ఎవరూ అంత తేలిగ్గా మరిచిపోలేరు.
తూర్పు గోదావరి జిల్లా అయినాపురంలో జన్మించిన సుత్తి వీరభద్రరావు, విజయవాడలో పెరిగారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఆయన కుటుంబం విజయవాడలో స్థిరపడింది. ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో విద్యాభ్యాసం సాగింది. ప్రముఖ దర్శకుడు జంధ్యాల, వీరభద్రరావు సహాధ్యాయిలు. ఆంధ్రా విశ్వవిద్యాలయం స్థాయిలో ఇద్దరూ కలిసి పలు నాటకపోటీల్లో పాల్గొన్నారు. డిగ్రీ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించిన సుత్తి ఆ తర్వాత కూడా నాటకాలతో అనుబంధం కొనసాగించారు. 1981లో ‘జాతర’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ‘నాలుగు స్తంభాలాట’తో ఆయనకి మంచి పేరొచ్చింది. సుదీర్ఘమైన సంభాషణల్ని పలుకుతూ అనతికాలంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకొన్నారు. 1982 నుంచి 88 కాలంలోనే 200కి పైగా సినిమాల్లో నటించారు. నరేష్, రాజేంద్రప్రసాద్ లాంటి కథానాయకులు చిత్రాల్లో వీరభద్రరావు కీలకపాత్రలు పోషించేవారు. సుత్తి వీరభద్రరావు సినిమాలో ఉంటే విజయం ఖాయమనే ఓ సెంటిమెంట్‌తో పలువురు దర్శకనిర్మాతలు, మా సినిమాలో కనీసం ఓ చిన్న పాత్రలోనైనా కనిపించాలంటూ సుత్తి వీరభద్రరావును సంప్రదించేవారు ఆయన ఆఖరి చిత్రం ‘చూపులు కలిసిన శుభవేళ’. నేడు వీరభద్రరావు జయంతి. ఈ సందర్భంగా ఆ మహానటుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.