ఆయన ప్రేమిస్తే… సంజయ్ రామసామి… పగబడితే గజినీ.. పంజా విసిరితే సింగం.. విలనిజం పండించడంలో ఆత్రేయ.. పాత్ర పాత్రకీ వైవిధ్యత.. పాత్ర పోషణలో విలక్షణత… కథలో ఎంపికలో పరిపూర్ణత ఆయన లక్షణాలు .. పేరు సూర్య. దక్షిణాది ప్రేక్షకులకు అతగాడు.. రోరింగ్ లయన్. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా ఆయనకి మంచి గుర్తింపు ఉంది.
సూర్య కోయంబత్తూరులో పెరిగారు. సూర్యకి తమ్ముడు కార్తి, చెల్లెలు బృందా ఉన్నారు. మద్రాసులోని సెయింట్ బేడీ స్కూల్, లయోలా కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. మొదట సినిమాలపై అంతగా ఆసక్తి లేని సూర్యకి ‘ఆశై’ సినిమాలో అవకాశం వచ్చినా తిరస్కరించారు. 1997లో ‘నేరుక్కు నేర్’ అనే చిత్రంతో పరిచయమయ్యారు సూర్య . ఆ తర్వాత మరిన్ని చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ఇక ‘నందా’తో సూర్య సినీ ప్రయాణం మలుపు తిరిగింది. నందా’లో నటనకిగానూ ఉత్తమ నటుడిగా పలు పురస్కారాలు అందుకొన్నారు. ఆపై .. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ‘కాక కాక’ చిత్రం సూర్యకి ఘన విజయాన్ని అందించింది. ఆ చిత్రం తెలుగులో వెంకీతో ‘ఘర్షణ’గా రీమేకై విజయం సాధించింది. బాల దర్శకత్వం వహించిన ‘పితామగన్’ కూడా తమిళంతో పాటు, తెలుగులోనూ అనువాదమై సూర్యకి మంచి పేరు తీసుకొచ్చింది. 2005లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గజిని’తో సూర్య సినీ ప్రయాణమే మారిపోయింది. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారాయన. అప్పట్నుంచి దాదాపుగా సూర్య నటించిన ప్రతి చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘సింగమ్’ చిత్రాలతోనూ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు సూర్య. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రంలో 16యేళ్ల యువకుడిగా, 65 యేళ్ల వృద్ధుడిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్’ తర్వాత మూడోసారి కె.వి.ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు సూర్య. ‘కాక్క కాక్క’ చిత్రంలో తన సరసన నటించిన కథానాయిక జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు సూర్య. ఆయనకి ఇద్దరు పిల్లలు. తన భార్య జ్యోతిక రీ ఎంట్రీ చేసిన ‘36 వయదినిలే’ చిత్రం కోసం సూర్య నిర్మాతగా మారారు. ఆ తరువాత ‘పసంగ2’, ‘24’, ‘మగలిర్ మట్టుమ్’, ‘కడైకుట్టి సింగమ్’ చిత్రాల్ని నిర్మించారు. తమ్ముడు కార్తి కథానాయకుడిగా ‘కడైకుట్టి సింగమ్’ తెలుగులో ‘చినబాబు’ పేరుతో విడుదలైంది. ప్రస్తుతం తమిళంలో ‘సురారై పోట్ట్రు’, ఇదే చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’గా రానుంది. ఈ సినిమాకి తెలుగమ్మాయి సుధ కొంగర దర్శకత్వం వహించారు. కరోనా వైరస్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. నేడు సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.