తెలుగు సినిమా నటీమణుల్లో సూర్యకాంతంది ప్రత్యేక అధ్యాయం. దర్శకుడు యాక్షన్ చెప్పగానే… ఆయనకి కట్ చెప్పే అవకాశం ఇవ్వని అరుదైన నటీమణి ఆమె. మాటల రచయిత డైలాగ్సే కాకుండా.. అప్పటికప్పుడు తన నోటికి ఏది అనిపిస్తే అది అనేసి.. ఎందరో దర్శకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రతిభ ఆమెది. ఈ తరహా నటీమణి మన భారతీయ తెరమీదే లేదంటే .. అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అలాంటి ఓ అరుదైన సంఘటన కులగోత్రాలు సినిమా షూటింగ్ లో జరిగింది. ఆ సినిమాకి దర్శకుడు ప్రత్యగాత్మ.
ప్రత్యగాత్మ దర్శకత్వంలో అందరికీ హాయిగా వుండేది. నటులకు స్వేచ్ఛ ఇచ్చే వారు. మరీ హద్దులు దాటిపోతే, చెప్పేవారు. ‘శ్రీమంతుడు’లో సూర్యకాంతం ఒక దృశ్యంలో నటిస్తున్నారు. స్క్రిప్ట్ ప్రకారం ఉన్న డైలాగులు అవతలి వారు చెప్పేశారు. సూర్యకాంతం మాత్రం ఆగలేదట. వాక్ప్రవాహం ఆనకట్ట కట్టినా ఆగదు. ఆవిడ ఏదో అదనపు మాటలు అన్నారు, పక్కనున్న సహనటులు ఇంకేదో అన్నారు. . మళ్లీ ఆవిడ… నాలుగైదు డైలాగులు పలికిన తరువాత, సూర్యకాంతం దర్శకుడి వేపు చూసి, ‘డైరెక్టర్ గారూ కట్ చెప్పలేదేంటి ?’ అని అడిగారట. ‘‘మీరేదో చెబుతున్నారుగా. కానీయండి చూద్దాం. ఎంత దూరం వెళతారో అని చూశాం’’ అన్నారట ప్రత్యగాత్మ నవ్వుతూ. సూర్యకాంతం సహజసిద్ధంగా పలికిన ఆ డైలాగ్స్ ని మార్చాల్సిన అవసరమే దర్శకుడికి రాలేదట. దటీజ్ .. సూర్యకాంతం.