కథకు కమర్షియల్ ఫార్మెట్ తొడిగి.. బాక్సాఫీస్ వద్ద విజయాల మోత మోగించడం ఆయన స్టైల్. హీరోలకు హైఓల్టేజ్ ఇమేజ్ తెచ్చిపెట్టడం ఆయన నైజం. బలమైన కాన్ఫ్లిక్ట్ తో .. సన్నివేశాల్ని కూర్చడం ఆయన తత్వం. దక్షిణాదిన అందరు అగ్రకథానాయకులతో సినిమాలు చేసి.. సక్సెస్ ను ఆస్వాదించిన ఆ మాస్ చిత్ర మాంత్రికుడి పేరు సురేశ్ కృష్ణ.

కేరళలో జన్మించి .. తండ్రి వృత్తి రీత్యా ముంబాయ్ లో స్థిరపడ్డారు సురేశ్ కృష్ణ. చెల్లెలు శాంతికృష్ణ ఒకప్పుడు మలయాళంలో ప్రముఖ హీరోయిన్. ముంబైలో ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సురేశ్ కృష్ణ ప్రముఖ దర్శకుడు యల్.వీ. ప్రసాద్ ఆఫీస్ లో ఎకౌంట్స్ మేనేజ్ మెంట్ లో పనిచేసేవారు. ఆ తర్వాత యల్వీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అయ్యారు.ఆపై కె.బాలచందర్ వద్ద అసోసియేట్ గా జాయిన్ అయ్యారు. కమల్ హాసన్ తో తెరకెక్కిన సత్య చిత్రంతో సురేశ్ కృష్ణ దర్శకుడిగా మారారు. ఆపై ప్రేమ, ఇంద్రుడు చంద్రుడు, అన్నామలై, వీర, బాషా, బాబా లాంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యారు. మోహన్ లాల్, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖ హీరోల సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. రజనీకాంత్ తో తన అనుభవాలను గురించి తెలపుతూ ’మై డేస్ విత్ బాషా’ అనే పుస్తకం రాశారు . ఉత్తమ దర్శకుడుగా 1989లో ప్రేమ సినిమాకు నంది అవార్డు అందుకున్నారు. సురేశ్ కృష్ణ తెలుగులో తీసిన ఆఖరి చిత్రం దాసరినారాయణరావు ప్రధాన పాత్రలో నటించిన మేస్త్రి. నేడు సురేశ్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

 

Leave a comment

error: Content is protected !!