ఒకప్పటి బాలీవుడ్ తెరపై ఆయన తిరుగులేని కథానాయకుడు. ఊపిరిసలపని చిత్రాలతో బిజీగా ఉంటూనే .. మరో పక్క దర్శకుడిగానూ, నిర్మాతగానూ రాణించారు. నిజానికి అలా తన సినిమాలకు తానే హీరో, నిర్మాత, దర్శకుడిగా మారిపోయిన మొట్ట మొదటి కథానాయకుడు ఆయనే అని చెప్పాలి. పేరు సునీల్ దత్. సినిమా ద్వారా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు .. సమాజ సేవతో వారిని ఆదుకోవడం కూడా చేయడంతో … సునీల్ దత్ చాలా సులువుగా.. రాజకీయాల్లో  రాణించగలిగారు.. ఆ పై కేంద్రమంత్రిగా కూడా చక్రం తిప్పారు.

సునీల్‌ దత్‌ అసలు పేరు బాల్‌రాజ్‌ దత్‌. తొలిసారిగా హిందీలో ‘రేడియో సిలోన్‌’ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత బాలీవుడ్‌లో ‘రైల్వే ప్లాట్‌ఫారం’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు.  ఆపై  ‘సాధన’, ‘సుజాత’, ‘మై చుప్‌ రహూంగీ’ వంటి మహిళలను చైతన్యపరిచే చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించారు. సునీల్‌ దత్‌ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం ‘ముజే జీనే దో’. దీంతో బాలీవుడ్‌లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. దీనికి తొలిసారిగా ఆయన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్‌ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా మిగిలిపోయారు. ఇక ‘మదర్‌ ఇండియా’ చిత్రంలో నర్గీస్‌కి కుమారుడి పాత్రలో నటించారు. ఆ రోజుల్లో ఈ చిత్రం భారీ విజయాన్నుందుకుంది. ఆ తర్వాత నర్గీస్‌నే వివాహమాడారు ఆయన.  సునీల్‌ దత్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో ఆయనే నిర్మించిన చిత్రం ‘యాదేన్‌’. ఇది బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది. ఇది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇవి కాకుండా ఆయన ‘రేష్మా ఔర్‌ షేర్‌’, ‘రాకీ’, ‘దర్ద్‌’, వంటి పలు చిత్రాలకు కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత వంటి ఎన్నో బాధ్యతలను మోశారు. ఇవన్నీ మంచి విజయం సాధించాయి కుమారుడు సంజయ్‌ దత్‌తో కలసి ‘మున్నాభాయ్‌ ఎమ్‌.బి.బి.ఎస్‌.’ చిత్రంలో నటించి ఆకట్టుకున్నారు. భార్య నర్గీస్‌ మరణం తర్వాత ‘నర్గీస్‌ ఫౌండేషన్‌’ పేరుతో కాన్సర్‌తో బాధపడేవారికి వైద్యసేవలందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. నటుడిగా ఆయన ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. నేడు సునీల్ దత్ జయంతి. ఈ సందర్భంగా ఆయనుకు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!