అందం, అభినయం మెండుగా నిండుగా ఉన్న కథానాయిక అదితీరావు హైదరి. సమ్మోహనం చిత్రంతో తెలుగులో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు నిజానికి ‘ప్రజాపతి’ అనే మలయాళ చిత్రంతో చిత్రసీమలోకి ప్రవేశించింది. ఈ రోజు ఆమె నటించిన మలయాళ చిత్రం ‘సూఫీయుమ్ సుజాతయుమ్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైంది. నరన్ పుళ షానవాస్ దర్శకత్వంలో విజయ్ బాబు నిర్మించిన ఈ సినిమాలో సూఫీగా దేవ్ మోహన్ నటించగా.. సుజాతగా అదితీరావు హైదరి అద్భుతంగా నటించింది. కాగా.. జయసూర్య సుజాత భర్తగా నటించాడు.
సుజాత అనే ఒక హిందువుల అమ్మాయి పుట్టు మూగ. తల్లిదండ్రులు ఆమెను ఎంతో అపురూపంగా పెంచుతారు. తనేం చేసినా తామూ సంతోషిస్తారు. ఆమెకు రోజూ మసీద్ లో అబూబ్ వాయించే క్లారినేట్ కు డ్యాన్స్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే మసీద్ లో ఉన్న అబూబ్ శిష్యుడు సూఫీ ని ఇష్టపడుతుంది. అతడికి ఆమెంటే ఎంతో ఇష్టం ఏర్పడుతుంది. అయితే ఆ అమ్మాయి మూగది కాబట్టి.. వారిద్దరూ ఒక డైరీలో తమ ఇష్టాయిష్టాల్ని రాసుకుంటూ.. తమ ప్రేమను మరింతగా పెంచుకుంటారు. ఈ విషయం సుజాత తండ్రికి తెలుస్తుంది. దాంతో ఆమెకు వెంటనే పెళ్లి నిశ్చయం చేస్తారు. నిజానికి సూఫీతో వెళ్లిపోవాలనుకున్న సుజాత తన తండ్రి బాధను చూసి ఆయన చూసిన పెళ్ళి చేసుకొని దుబాయ్ వెళ్లిపోతుంది. ఆ తర్వాత సూఫీ కనిపించడు. పదేళ్ల తర్వాత మళ్లీ సూఫీ అదే మసీద్ కు వచ్చి.. నమాజ్ చేసి అక్కడే ప్రాణాలు విడుస్తాడు. సూఫీ మరణ వార్త విన్న సుజాత బాధను చూడలేక .. ఆమె భర్త ఆమెను అతడి అంత్యక్రియలకు ఇండియా తీసుకెళతాడు. అప్పుడు సంభవించే సన్నివేశాలు చాలా హృద్యంగా ఉంటాయి. ఇందులో సూఫీ , సుజాతల ప్రేమ సన్నివేశాల్ని ఎంతో అందంగా చిత్రీకరించాడు దర్శకుడు. ఈ మధ్యకాలంలో సౌత్ లో ఇంత బరువైన ప్రేమకథా చిత్రమే రాలేదంటే.. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా సుజాతగా అదితీరావు హైదరి మూగాభినయం అచ్చెరువొందిస్తుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్న ఈ సినిమా .. విడుదలైన రోజు నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది.