Sudheer babu :  వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుధీర్ బాబు తాజాగా “హరోం హర” అనే పీరియాడిక్ యాక్షన్ చిత్రంతో వస్తున్నారు. జ్ఞానసాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు హైదరాబాద్ లో మీడియా ఇంటరాక్షన్ లో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

‘హరోం హర’ చిత్ర కథ 1980ల నాటి కుప్పం నేపథ్యంలో జరుగుతుంది. దర్శకుడు జ్ఞానసాగర్ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను సిద్ధం చేసుకున్నారు. ట్రైలర్ చూసిన మహేష్ బాబు కూడా చిత్రం గురించి ప్రశంసించినట్లు సుధీర్ బాబు తెలిపారు. “నా గత చిత్రాలలో కొన్ని తప్పులు చేశాను. కానీ ఈ చిత్రంలో అలాంటి తప్పులు ఏమీ లేవు. నా పాత్రకు ఒక ప్రత్యేకమైన యాస ఉంటుంది. పూర్తిగా కుప్పం యాసలో డైలాగ్ లు మాట్లాడాను. ఈ చిత్రం తెలుగులో వచ్చిన టాప్ 10 యాక్షన్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని నమ్ముతున్నాను.

యాక్షన్ తో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన చిత్రమిది” అని సుధీర్ బాబు అన్నారు. “నేను ఎప్పుడూ నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలని, భిన్నంగా ఉండాలని కోరుకుంటాను. కొన్ని సినిమాలు విజయం సాధించగా మరికొన్ని ఫ్లాప్ అయినా నేను నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదని నమ్ముతున్నాను.

ఇటీవలే నేను ఏపీ సీఎం చంద్రబాబును కలిసి నా కొత్త చిత్రం గురించి చెప్పాను. “ఇంక సెప్పెదేమ్‌ లేదు.. సేసేదే” అనే డైలాగ్ మీకు నచ్చితే ఎక్కడైనా వాడండి అని అడిగాను . ఆయన నవ్వి ఆమోదించారు” అని సుధీర్ బాబు తెలిపారు. “హరోం హర” చిత్రానికి సీక్వెల్ ఉండే అవకాశం ఉందని, ఫలితాలను బట్టి దానిపై నిర్ణయం తీసుకుంటామని సుధీర్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం “మా నాన్న సూపర్ హీరో” అనే మరో చిత్రంలో నటిస్తున్నారని, అలాగే మరో రెండు సినిమాలకు కమిట్ అయినట్లు తెలిపారు.

 

Leave a comment

error: Content is protected !!