ఆయన పాటకు మట్టి వాసన తెలుసు. మానవత్వం తెలుసు. మంచి మనసు తెలుసు. విప్లవ భావాలైనా, జానపదమైనా, శృంగార రసాన్ని ఒలికించాలాన్నా… సెంటిమెంట్ గీతమైనా… ఆయన కలం నుంచి జాలువారిందంటే చాలు.. అది కొన్నాళ్లపాటు శ్రోతల మదిలో నిలిచిపోవల్సిందే. 24 యేళ్ల సినీ ప్రయాణంలో 1200పై చిలుకు సినిమాల్లో 2400పైగా పాటల్ని రచించిన ఘనత ఆయనది. ఆయన పేరు సుద్దాల అశోక్ తేజ. నేలమ్మ నేలమ్మ… అంటూ మట్టి పరిమళాల్ని వెదజల్లిన కలం అది. ఒకటే జననం ఒకటే మరణం… అంటూ పోరాట స్ఫూర్తినీ రగిలించింది. నువు యాడికెళ్తే ఆడికొస్త సువర్ణా… అంటూ కొంటె బాణాల్నీ విసురుతుంది. నీలి రంగు చీరలోన సందమామ నీర జాణ…అంటూ మెలోడీ గీతాలతో మది మదినీ దోస్తుంది. శ్రీశ్రీ, వేటూరి తర్వాత ‘నేను సైతం…’ అంటూ తెలుగు పాట కీర్తి పతాకాన్ని జాతీయస్థాయిలో రెపరెపలాడించిన ఘనత సుద్దాలది. ‘ఠాగూర్’ చిత్రం కోసం సుద్దాల రాసిన నేను సైతం… పాటకి జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు సుద్దాల.
ఇటీవల కాలంలో హిట్ అయిన ‘ఫిదా’ చిత్రంలోని పాటతో సహా…రొమాంటిక్ టచ్ ఉండే అనేకానేక పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. కేవలం విప్లవ పాటలే రాస్తారన్న అపవాదును తొలగించుకుని…అన్ని రకాల పాటల్ని రాయగల సత్తా, సమర్ధత తనకుందని నిరూపించిన సినీ కవి సుద్దాల అశోక్ తేజ. శంకర్ దర్శకత్వం వహించిన ‘రోబో’ సినిమాలో కూడా అశోక్‌తేజ రాసిన పాటలు జనాదరణ పొందాయి. ఓ మరమనిషి మాలోకి రా…, ఇనుముతో హృదయం మొలిచెలే…ముద్దిమ్మంటూ నిన్నే వలచేలే…పాటలు ఎంత విజయం సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్ఫూర్తివంతమైన పాటలు కూడా ఎన్నో రాసి యువత హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నేడు సుద్దాల పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.