అతడో స్టైల్ ఐకాన్. యువతరానికి రోల్ మోడల్ . యాక్టింగ్ లో కింగ్ .. యాక్షన్ లో రోరింగ్ లయన్. ఇక డ్యాన్సుల్లో దుమ్మురేపే దమ్ము అతడి సొంతం. అతడే అల్లువారి నటవారసుడు.. అర్జున్. అందరికీ ముద్దుల బన్నీ. చిన్నప్పటినుంచీ అతడికి డ్యాన్సుల్లోనూ, ఫైట్స్ లోనూ యాక్టింగ్ లోనూ మెగాస్టార్ చిరంజీవే ఆదర్శం. ఆయన్ని చాలా దగ్గర నుంచి చూస్తూ పెరగడం వల్ల.. అభిమానుల మీద ఈగ వాలకుండా చూసుకోవడం, వారికి కావాల్సింది ఇవ్వడం.. వారి నుంచి ప్రేమాభిమానాలు అందుకోవడం అతడికి బాగానే ఒంటబట్టాయి.
విజేత’ సినిమాలో అల్లు అర్జున్ బాలనటుడిగా కనిపిస్తాడు. ఆ తరువాత ‘డాడీ’ చిత్రంలో డాన్సర్‌గా కనిపించాడు. ఆ తరువాత రాఘవేంద్రరావు సినిమా ‘గంగోత్రి’తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు అల్లు అర్జున్. ఇది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి వందవ సినిమా. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య’ సినిమాలో పాత్రకు ఎంతో పేరు వచ్చింది. ఈ చిత్రం కూడా విమర్శనాత్మకంగానే కాకుండా కమర్షియల్‌గా కూడా విజయం సాధించింది. ఇక అక్కడ నుంచి బన్నీ పరుగు ఆగలేదు. ఎన్నో యాక్షన్ చిత్రాలతో అతడి స్థాయి పెరుగుతూ వచ్చింది. ‘వరుడు’, ‘వేదం’ చిత్రాలతో నటుడిగా తానేంటో నిరూపించుకొన్న ఆయన, ‘జులాయి’తో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రేసుగుర్రం’, ‘ఎవడు’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సరైనోడు’ చిత్రాలతో ఆయన స్థాయి మరింత పెరుగుతూ వచ్చింది. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డిగా నటించి మెప్పించాడు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాలతో ఆయన అభిమానుల్ని మెప్పించాడు. త్రివిక్రమ్‌తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేశాడు. ప్రస్తుతం 20వ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్‌కు మలయాళ సినిమా పరిశ్రమలో కూడా తిరుగు లేని స్టార్డం ఉంది. టాలీవుడ్ హీరోలలో ఏ హీరోకూ దక్కనంత స్టార్ స్టేటస్ మలయాళ సినిమా పరిశ్రమలో దక్కించుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ నటించిన దాదాపు ప్రతీ సినిమా కూడా మలయాళ భాషలో కూడా విడుదలయ్యి అక్కడ ప్రేక్షాభిమానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ స్టైలిష్ స్టార్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్