నటులు అవ్వాలనే చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అదృష్టముంటే అవకాశాలు కాళ్ళ దగ్గరకు వస్తాయి. లేకుంటే.. చాలా మంది నిర్మాతల కాళ్ళు పట్టుకోవాల్సిన దుస్థితి పడుతుంది. ఆ గతి పట్టకూడదనే .. వీరమాచనేని రాజేంద్రప్రసాద్ అనే విబీ రాజేంద్రప్రసాద్ తనే నిర్మాతగా మారి .. జగపతి అనే బ్యానర్ స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి తెలుగు సినీ జగానికే పతిగా మారారు. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో మొత్తం 32 సినిమాలు నిర్మించి.. 19 చిత్రాలకు దర్శకత్వం వహించి సత్తా చాటుకున్నారు.
కృష్ణా జిల్లా డోకిపర్రుకు చెందిన రాజేంద్రప్రసాద్ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. స్కూల్లోనూ, కాలేజీలోనూ చదివేరోజుల్లోనే నాటకాల్లో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఏడిద నాగేశ్వరరావు పరిచయంతో రాఘవ కళాసమితి అనే నాటక సంస్థను స్థాపించి, ఎన్నో నాటకాలు ప్రదర్శించి బహుమతులు కూడా అందుకున్నారు. ఆ తర్వాత నటుడవ్వాలనే కోరికతో మద్రాస్ చేరుకున్న రాజేంద్ర్ ప్రసాద్ కు అక్కినేని నాగేశ్వరరావు పరిచయం అయ్యారు. ఆయన దుక్కిపాటి మధుసూదనరావుకు పరిచయం చేశారు. కానీ నటుడిగా అవకాశాలు రాలేదు. దాంతో అక్కినేనే స్వయంగా ఆయనచేత ఆయన తండ్రిగారు జగపతి పేరుమీద ఒక నిర్మాణ సంస్థ స్థాపింపచేశారు. అంతస్థులు , ఆరాధన, ఆత్మబలం, ఆస్థిపరులు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన రాజేంద్రప్రసాద్ .. ‘దసరాబుల్లోడు’ తో దర్శకుడిగా మారి ఆ రంగంలోనూ తనకు తిరుగు లేదని నిరూపించుకున్నారు. నేడు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.