ముగ్ధమోహనరూపం.. ముచ్చటగొలిపే కనుముక్కుతీరు.. ఎల్లప్పుడూ చిరునవ్వులొలికించు పెదాలు…ఆవిడ చిరునామా. సత్సాంప్రదాయాన్ని , క్రమశిక్షణని తన ఇంటిపేరుగా చేసుకొని సంగీత కుటుంబంలో జన్మించిన ఆమె .. అందమైన అభినయాన్ని, అభినయానికే వన్నె తెచ్చే అందంతోనూ ఒకప్పటి దక్షిణాది తెరపై వెలిగిన కథానాయిక. పేరు శ్రీవిద్య. ప్రముఖ దివంగత సంగీత విద్వాంసురాలు యం.యల్. వసంతకుమారి కూతురే ఆమె. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆమె 800 పైచిలుకు చిత్రాల్లో నటించి మెప్పించింది. 40 ఏళ్ళ ఆమె సినీ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు .. మరెన్నో అవరోధాలు.
మద్రాసులో జన్మించిన శ్రీవిద్య.. తండ్రి తమిళ కమెడియన్ కృష్ణ మూర్తి అయితే… తల్లి ప్రముఖ సంగీత విద్వాంసురాలు. ఆ ఇద్దరి వల్ల ఆమెలో ఇటు నటన, అటు సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. తల్లినే గురువుగా చేసుకొని ఆమె దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని అవపోసన పట్టారు. స్వతహాగా అందగత్తె అయిన ఆమెకు సినీ అవకాశాలు రావడం పెద్ద కష్టం కాలేదు. బాలనటిగానే ఆమెను అక్కున చేర్చుకున్న తమిళ ఇండస్ట్రీ .. పదహారేళ్ళ అందగత్తె గా మారితే ఎందుకు వదలిపెడుతుంది? 1967లో ‘తిరువరుచ్చెల్వర్’ అనే మూవీతో నటి గా తమిళనాట అడుగుపెట్టింది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో కథానాయికగా నటిస్తూండగానే.. మలయాళం నుంచి ఆమెకు పిలుపొచ్చింది. అక్కడ ‘చట్టంబిక్కవళ’ మూవీతో రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులో ‘తాతా మనవడు’ చిత్రంతో శ్రీవిద్య నటీమణిగా ప్రవేశించారు. ఆపై దక్షిణాదిన చక్కటి నటీమణిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్ని భాషల్లో నటించినా.. ఆమె ఎక్కువగా మలయాళ చిత్ర పరిశ్రమకే ప్రధాన్యతనిచ్చేవారు. ఒకదశలో ఆమె చెన్నై నుంచి తిరువనంతపురం మకాం మార్చేశారు. అయితే ఆమెకు వైవాహిక జీవితం కలిసిరాలేదు. దానికితోడు ఆమెను వెన్నుపూస కేన్సర్ బాధించింది. చవరికి దానితోనే ఆమె కన్నుమూశారు. చనిపోయే ముందు తన ఆస్తిలో సగం వాటాను స్వచ్ఛంద సంస్థలకు రాసేశారు. నేడు శ్రీవిద్య జయంతి. ఈ సందర్బంగా ఆమెకు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.