హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు శ్రీరామ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
హారర్ సినిమాల విషయంలో నాకో భయం ఉంటుంది. అదేంటంటే పేరుకి హారర్ సినిమా అంటారు.. కానీ అందులో అనవసరమైన కామెడీ, రొమాన్స్, సాంగ్స్ ను ఇరికిస్తుంటారు. హారర్ జానర్ అంటే హారర్ ఉండాలి. థియేటర్ లో మనం చూసేటప్పుడు ఉలిక్కిపడేలా ఉండాలి. సాయికిరణ్ దైదా పిండం కథ చెప్పగానే నచ్చింది. కొత్త దర్శకుడు అయినప్పటికీ ఆయనకి ఎంతో క్లారిటీ ఉంది. సాయి కిరణ్ తీసిన స్మోక్ అనే షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన ప్రతిభపై నమ్మకంగా కలిగింది. ఇన్ని రోజుల్లో, ఇంత బడ్జెట్ లో సినిమా పూర్తి చేస్తామని చెప్పారు. చెప్పినట్లుగానే చేశారు. నిర్మాత యశ్వంత్ ఈ కథను నమ్మి సినిమా చేశారు. ఆ తర్వాత సినిమాని చూపించి బిజినెస్ చేసుకోగలిగారు. ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూసి అనుభూతి చెందాల్సిన అసలైన హారర్ సినిమా. ఈ కథ 1930, 1990, ప్రస్తుతం ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. ఒక ఇల్లు, ఒక కుటుంబం అన్నట్టుగా సినిమా ఉండదు. ఇందులో చాలా కథ ఉంటుంది. పిండం టైటిల్ తో కూడా కథ ముడిపడి ఉంటుంది.
అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు రాత్రి అనే సినిమా తీశారు. నా దృష్టిలో ఇప్పటిదాకా తెలుగులో భయంకరమైన సినిమా అంటే అదే. ఆ సినిమాని ఎన్నో సార్లు చూశాను. పలు ఇంగ్లీష్ హారర్ సినిమాలు కూడా ఎన్నోసార్లు చూశాను. పిండం అనేది కేవలం హారర్ సినిమా కాదు. ఇందులో బలమైన కథ ఉంటుంది. హార్రర్ సన్నివేశాల ఉండటమే కాకుండా.. ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది సినిమా. మిగతా సినిమాలతో పోలిస్తే పిండం వైవిధ్యంగా ఉంటుంది. ఇది కొన్ని కుటుంబాల ప్రయాణం. ఇది కేవలం హారర్ మాత్రమే కాదు.. ఇదొక ఎమోషనల్ డ్రామా. ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది.
నేను, జి.వి. ప్రకాష్ కలిసి తమిళ్ లో బ్లాక్ మెయిల్ అనే మూవీ చేస్తున్నాం. అలాగే సంభవం అనే ఇంకో సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి.

Leave a comment

error: Content is protected !!