అతి చిన్న వయసులోనే సినిమా నిర్మాణంపై అవగాహన పెంచుకుని మంచి మంచి చిత్రాలు నిర్మించారు. అందరూ చూడదగ్గ రీతిలో ఆరోగ్యకరమైన హాస్యాన్ని ప్రేక్షకులకు అందించారు. స్టార్ హీరోల జోలికి పోకుండా.. కథను బట్టి నటీనటుల్ని ఎంపిక చేసుకొని సినిమాలు నిర్మించడంలో ఆయన దిట్ట. పేరు రవికిశోర్. స్రవంతి మూవీస్ బ్యానర్ అధినేత కావడం వలన ఆయన్ను అందరూ స్రవంతి రవికిశోర్ అని పిలుస్తారు. ఎనర్జిటిక్ హీరో రామ్ కి ఆయన పెదనాన్న అవుతారు.

రవికిశోర్  వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. విజయవాడలో పని చేస్తుండేవారు.  గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన వ్యాపారం చేసేవారు. మొదట్లో ఆయనకు సినిమాల మీద అంతగా ఆసక్తి ఉండేది కాదు. తర్వాత స్నేహితుల సలహా మేరకు సినీ నిర్మాణ రంగంలో ప్రవేశించారు. మొదట్లో దాన్ని ఆయన పూర్తి వ్యాపార ధృక్పథంతో ఆలోచించినా నెమ్మదిగా సినిమాల మీద ఆసక్తి పెరిగింది. మంచి సినిమాలు తీయాలనే తపన కలిగింది.  మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన స్రవంతి అనే నవల చదివి ఆ స్ఫూర్తితో తన నిర్మాణ సంస్థకు స్రవంతి మూవీస్ అనే పేరు పెట్టారు. మిత్రులు తమ్ముడు సత్యం, సాయిబాబా తో కలిసి 1986 లో వంశీ దర్శకత్వంలో  లేడీస్ టైలర్ చిత్రాన్ని నిర్మించారు. ఆ  తర్వాత మహర్షి, కనకమహాలక్ష్మి డ్యాన్స్  ట్రూప్, లింగబాబు లవ్ స్టోరీ లాంటి సినిమాలకు పనిచేశారు. ఆ తరువాత ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో  మూడు సినిమాలు నిర్మించారు. తర్వాత కె. విజయభాస్కర్ దర్శకత్వంలో  రెండు సినిమాలు నిర్మించారు. ఇక ‘నువ్వేకావాలి’ సినిమా కోసం మలయాళం నుంచి హక్కులు కొని అప్పటి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో దాన్ని ఉషాకిరణ్ మూవీస్ ఆద్వర్యంలో నిర్మించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కోటి, సుచిత్ర చంద్రబోస్, శ్రీకర్ ప్రసాద్ లాంటి సాంకేతిక నిపుణులతో ఎక్కువగా పనిచేశారు. నేడు రవికిశోర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

 

Leave a comment

error: Content is protected !!