శ్రుతి పక్వంగా, తాళ బద్ధంగా, గంభీరమైన గాత్రంతో ఆయన పాడుతుంటే.. వినడానికి శ్రోతల రెండు చెవులూ చాలవు. చాలా పెక్యులర్ వాయిస్ తో దాదాపు ఆరు దశాబ్దాలకు పైగానే దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన సుందర గాయకుడు ఆయన. పేరు తొగులువ మీనాక్షి అయ్యంగార్ సౌందర రాజన్. షార్ట్ కట్ లో ఆయన టి.యమ్. సౌందర రాజన్. దక్షిణ భారత సినీ దిగ్గజాలైన ఎమ్.జి. రామచంద్రన్, ఎన్.టి. రామారావు, జెమినీ గణేశన్, అక్కినేని నాగేశ్వరరావు తదితరులతో పాటు, కమలహాసన్, రజనీకాంత్ తదితర కథానాయకులకు కూడా గాత్రదానం చేశారు. పదకొండు భాషల్లో పాటలు పాడారు. ఆయన సంగీత దర్శకత్వంలో ఎన్నో జనరంజకమైన పాటలు, భక్తిగీతాలు వెలువడ్డాయి. తమిళనాడు ప్రభుత్వం ఆయన పేరుతో ఒక స్టాంప్ కూడా విడుదల చేసింది.
సౌందరరాజన్ మధురై లోని అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. తల్లి మీనాక్షి అయ్యంగార్ పేరు మోసిన కర్నాటక విద్వాంసురాలు. ఏడవ ఏటనుంచే సౌందర్ రాజన్ పాటలు పాడడం మొదలు పెట్టారు. 27వ ఏటనుంచి తమిళనాట వివిధ ప్రదేశాల్లో కర్నాటక గాత్ర సంగీత కచేరీలు మొదలు పెట్టి.. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ ప్రతిభే ఆయన్ను సినీ గాయకుడిగా మార్చేసింది. 1946 లో కృష్ణ విజయం చిత్రంతో సౌందర రాజన్ నేపథ్యగాయకుడిగా మారారు. లౌడ్ వాయిస్ తో చాలా శ్రావ్యంగా ఆయనపాడే తీరుకు అందరూ ముగ్ధులవుతారు. ఆ గాత్రం వల్లనే ఆయన 2010 వరకూ పాటు పాడి దక్షిణాది సినీ ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పటివరకూ సౌందరరాజన్ 3162 చిత్రాల్లో దాదాపు గా 10,138 పాటలు పాడి.. తన సంగీత తృష్ణ తీర్చుకున్నారు. నేడు సౌందరరాజన్ వర్ధంతి. ఈ సందర్భంగా ఆ సుందర గాయకుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.