వెండితెరమీద బొమ్మాళీ నిన్నొదలా అంటూ.. అఘోరా గా నటించి మెప్పించిన విలన్ సోనూ సూద్.. ఈ ప్రపంచానికే విలన్ గా మారిన కరోనా వైరస్ లాక్ డౌన్ లో చిక్కుకున్న వలస కార్మికులను వారి సొంత ఊళ్ళకు పంపించి నిజ జీవితంలో హీరో అయ్యాడు. లాక్ డౌన్ వేళ ప్రభుత్వాలే చేయలేని సాయాన్ని మంచి మనసుతో చేసి శహభాష్ అనిపించాడు. రెండు రాష్ట్రాల మధ్య చిక్కుకు పోయిన వలస కార్మికుల్ని వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏకంగా 10 ప్రయివేటు బస్సుల్ని అద్దెకు తీసుకుని తిప్పాడు సోనూ సూద్ . అందుకోసం మహారాష్ట్ర- కర్నాటక ప్రభుత్వాల అనుమతుల్ని తీసుకుని క్షేమంగా వారి ఇండ్లకు చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాడు.
లాక్ డౌన్ వల్ల వలస కూలీలకు ఎటూ పోలేని పరిస్థితి. తమఇళ్లకు వెళ్లడానికి కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారిని తిరిగి రావడానికి అనుమతించడం లేదు. ఈ సమయంలో – నటుడు సోను సూద్ ముంబై గుల్బర్గాలో చిక్కుకున్న అనేక మంది కార్మికులను రక్షించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని థానే – కర్ణాటకలోని గుల్బర్గా నుండి వలస వచ్చిన వారిని పంపించడానికి ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకున్నారు. ఈ బస్సులు ప్రారంభమయ్యే ముందు సోనూసూద్ థానే బస్ స్టాప్ వద్దకు చేరుకున్నాడు. ప్రయాణీకులంతా ఒక గొప్ప సహాయం చేసినందుకు అతడికి కృతజ్ఞతలు తెలిపారు. దటీజ్ సోనూ సూద్.