టాలీవుడ్ వెటరన్ హీరో కృష్ణంరాజు రెబల్ స్టార్ ఎందుకయ్యారో .. ఆయన సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. అప్పట్లో యాంగ్రీ యంగ్ మేన్ పాత్రలు చేయడానికి దర్శకులందరికీ ఒకే ఒక ఆప్షన్ కృష్ణంరాజు. ఆయన నట జీవితంలో అత్యధికంగా యాక్షన్ మూవీసే చేయడం వల్ల ఆయనకు అన్నీ అలాంటి కథలే వచ్చేవి . ఆ జాబితాలోని ఒక చిత్రమే ‘శివమెత్తిన సత్యం’. 1980, జనవరి 11న విడుదలైన ఈ సినిమా అప్పటి టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. వి.మధుసూదనరావు తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై.. సరిగ్గా నేటికి 40 ఏళ్ళయింది. కృష్ణంరాజు మొదటి సారిగా (తండ్రీ, కొడుకులుగా) ద్విపాత్రాబినయం చేసిన ఈ సినిమాలో శారద, జయసుధ, గీత, త్యాగరాజు, ప్రభాకరరెడ్డి , సత్యనారాయణ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. భార్యా , బిడ్డలతో ఉన్న ఊరు ఒదులుకొని ఏదో ఒక పనిచేసుకొని పొట్ట పోషించుకోడానికి పట్నం వలసపోయిన సత్యం అనే ఒక నిజాయితీ పరుడైన ఒక మొండి బండ మనిషిని.. మోసం చేసి .. అతడి భార్య, చెల్లెలిపై అత్యాచారం చేసి అతడ్ని జైలుకు పంపుతారు కొందరు దుర్మార్గులు. అతడు జైలు నుంచి విడుదలై , కోటీశ్వరుడై.. తనకు అన్యాయం చేసిన వారిపై శివమెత్తడమే చిత్ర కథ. కృష్ణం రాజు సినీ కెరీర్ లోనే ప్రత్యేకమైన గా నిలచిపోయిన ఈ సినిమా కు జె.వి.రాఘవులు సంగీతాన్ని అందించారు. రాధాకృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు సమర్పణలో జి.సత్యనారాయణ రాజు నిర్మించారు.