Sithara Ghattamaneni : సూపర్ మహేష్ బాబు స్థాపించిన మహేష్ ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా, గుండె శస్త్రచికిత్సలకు అవసరమైన పేద పిల్లలకు సహాయం చేయడంలో మహేష్ బాబు ఎంతో ముందుండి నిలుస్తున్నారు.
ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ, సితార ఘట్టమనేని తన తాత, తండ్రి దృక్పథాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతోంది. తన మొదటి సంపాదననే చారిటీకి ఇచ్చిన సితార.. తాజాగా ఒక నీట్ ర్యాంకర్‌కు డాక్టర్ కావడానికి సహాయం చేసి మరోసారి అందరి మనసుల్ని గెలిచుకుంది.
2024 నీట్ పరీక్షలో 600 కు పైగా స్కోర్ సాధించిన నవ్య, సాధారణ కళాశాలలో చదువుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డాక్టర్ సీటు సంపాదించింది. కానీ పుస్తకాలు, హాస్టల్, ఫీజులు చెల్లించలేక చిక్కుకుంది. ఈ సమస్యను గుర్తించిన నవ్య, మహేష్-కృష్ణ ట్రస్ట్‌ను సంప్రదించింది. సితార ఆమె కలను నెరవేర్చడానికి ముందుకు వచ్చి, డాక్టర్ అయ్యే వరకు చదువుకునేందుకు అవసరమైన సహాయం చేస్తానని హామీ ఇచ్చింది.
తక్షణ సహాయంగా రూ. 1,25,000 అందించడమే కాకుండా, ల్యాప్‌టాప్, స్టెతస్కోప్ కూడా అందించింది. అంతేకాకుండా, తన పుట్టినరోజు వేడుకలను కూడా నవ్యతో కలిసి జరుపుకుంది. ఈ సహాయంతో నవ్య ఆనందంతో మునిగిపోయింది. నీట్ ర్యాంక్ తోనే తన కల నెరవేరదని భయపడిన ఆమెకు, సితార అండగా నిలిచి డాక్టర్ కావడానికి మార్గం సుగమం చేసింది. సహాయం చేయడంలో సితార తన తండ్రి, తాతలను మించిపోయిందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కుటుంబం నిజంగా స్ఫూర్తిదాయకం అని కొనియాడుతున్నారు.