సాహితీ సిరి తో వెన్నెలంత హాయిని పంచే లెజెండ్, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. పదునైన భావాన్ని పరుషంగానూ, పౌరుషంగానూ.. మొత్తానికి జడత్వం నిండిన మనసును జాగృతం చేయగలిగేలా రాసే గొప్ప గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. భావ కవిత్వాన్ని అత్యంత సరళంగా అందరి మనసును తాకేలా రాయడంలో ఆయనకు ఆయనే సాటి. పాట ద్వారా మోటివేషన్ చేయగల సమర్ధుడాయన. ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా.. ఆయన పాటలతో మదిలో మార్మోగుతూనే ఉంటారు. ఇప్పుడాయన లేరు సరే.. ఆయనే ఉండి ఉంటే మరెన్ని పాటలతో యువతను, సమాజాన్ని ఎంతలా జాగృతం చేసేవారో అన్న ఆలోచనతో ‘స్వప్నాల నావ ‘ అనే పాటకు శ్రీకారం చుట్టారు గోపీకృష్ణ కొటారు. వీరు అమెరికాలోని డల్లాస్‌లో స్థిరపడిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వీరి అమ్మాయి శ్రీజ ఈ పాటను పాడటం విశేషం. గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా ఈ పాట వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ పాటను శ్రీజ కొటారు పాడటంతో పాటు నటిస్తున్నారు కూడా. విఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినీ నిర్మాత మీనాక్షి అనిపిండి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.