ఎంతవారుగానీ వేదాంతులైన గానీ.. నా మదినిన్ను పిలచింది గానమై… తారలెంతగా వలచేనో.. హసీనా.. ఓ హసీనా.. లాంటి పాటలు మధురమైన పాటలు వినగానే.. మన మనసు మత్తెక్కిపోతుంది. తన అమృతగానంతో సమ్మోహన పరిచిన గాయకుడు మన కళ్ళముందు కదలాడతాడు. భాషతో సంబంధం లేకుండా.. కొన్ని దశాబ్దాల కాలం పాటు భారతీయ ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన ఆ గాయకుడు మహమ్మద్ రఫీ. ప్రేమగీతాలు, భక్తి గీతాలు, భజన పాటలు, విషాద గీతాలు, కవ్వాలీలు, గజళ్లు, జానపద గీతాలు, కవ్వింపు పాటలు… ఒకటేమిటి… రఫీ గొంతులోంచి వెలువడని విభిన్న రకాల పాటలు లేవంటే నమ్మాలి. అంతగా ఆయన గానం మనల్ని పరవశుల్ని చేస్తుంది.
రామనీక్ ప్రొడక్షన్స్ వారు కె.అమరనాథ్ దర్శకత్వంలో నిర్మించిన ‘గామ్ కి గోరి’ అనే సినిమాలో శ్యామ్ సుందర్ సంగీత దర్శకత్వంలో ‘ఆయె దిల్ హో కాబు మే’ అనే తొలి పాట పాడారు రఫీ . తరవాత నౌషద్ సంగీత దర్శకత్వంలో పదేళ్లపాటు ఏకధాటిగా అనేక సినిమాలకు రఫీ పాటలు పాడాడు. వాటిలో ‘పెహలే ఆప్’, ‘అన్మోల్ ఘడి’ ఖీ ‘షాజహాన్’, ‘దులారి’ , ‘దీదార్’ , ‘ఉరన్ ఖటోలా’ పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. మహమ్మద్ రఫీ గొంతుక విభిన్న స్వరాలను అవలీలగా పలికించేది. రఫీ కేవలం ఒక మంచి గాయకుడే కాదు మంచి ‘మనీషి’ కూడా. అందుకే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి అత్యంత ఇష్టమైన గాయకుడు రఫీ. దేశభక్తి గీతాలైనా, గజళ్ళు అయినా, కవ్వాలీలైనా, విషాద గీతాలైన, ప్రేమ గీతాలైనా రఫీ గొంతుకలోని అమృతంలో తడిసి అద్భుత గీతాలుగా వెలువడేవి. 1948లో ప్రధమ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రు రఫీకి బంగారు పతకం ప్రదానం చేశారు. 1967లో పద్మశ్రీ పురస్కారం లభించింది. భారత తపాలాశాఖ పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. స్టార్ డస్ట్ మ్యాగజైన్ ‘బెస్ట్ సింగర్ ఆఫ్ ది మిలీనియం’ బహుమతి ప్రకటించింది. నేడు మహహ్మద్ రఫీ వర్ధంతి.ఈ సందర్భంగా ఆ సమ్మోహన గాయకుడికి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.