కోటికోయిలలు ఒకేసారి గొంతెత్తి పాడితే వినిపించే మాధుర్యం ఆమెది. ఆమె గొంతు వింటే ప్రకృతి కూడా తన్మయత్వంతో తేలియాడిపోతుంది. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రస:ఫణి అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం ఆమె గాత్రం. అమృతము, తేనె కలగలిసిన సుధారస ఝరి ఆమె గాత్రం. ఆమె పేరు యస్.జానకి. పూర్తిపేరు శిష్ఠా శ్రీరామమూర్తి జానకి.
గుంటూరు జిల్లా, రేపల్లెకు సమీపంలోని పల్లపట్ల గ్రామంలో జన్మించింది జానకమ్మ. ఆమెకి బాల్యం నుంచి సంగీతంపై మక్కువ ఎక్కువ. ఆ మక్కువతోనే చిన్నతనంలోనే ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసి సంగీతంలో ఆరితేరింది. తన మామయ్య సలహాతో 19ఏళ్ల వయసులో మద్రాసుకు చేరుకొని సినీ రంగంలో అడుగుపెట్టడానికి సిద్ధపడింది. జానకమ్మ మద్రాసుకు వెళ్లిన తొలినాళ్లలో ఏవీఎం స్టూడియోలో గాయనిగా ఉండేది. ఆ సమయంలోనే జానకిలోని స్వర ప్రతిభను చూసి సంగీత దర్శకులు టి.చలపతిరావు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘విధియిన్ విలాయత్తు’లో పాట పాడే అవకాశాన్నిచ్చారు. ఇందులో జానకమ్మ, పి.బి.శ్రీనివాస్‌తో కలిసి తొలిసారి తన గొంతును వినిపించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. దాని తర్వాత ‘ఎం.ఎల్.ఏ’ (1957) చిత్రంలో ఘంటసాలతో కలిసి ‘‘నీ ఆశ అడియాస..’’ పాట పాడారు. ఇది ఆమె పాడిన తొలి తెలుగు సినీ గీతం. ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. అక్కడి నుంచి మొదలైన ఆమె గాన మాధుర్యం సెలయేరులా సాగుతూ, ఎన్నో మలుపులు తిరుగుతూ ఆబాలగోపాలాన్నీ అలరింపజేసింది.
విషాదమైనా, ఆనందమైనా, ప్రేమ భావనైనా ఎలాంటి భావాలనైనా జానకి తన గొంతుతో అద్భుతంగా పలికించి చూపిస్తుంది. దానికి భాషా, ప్రాంతీయ భేదాలుండవు. ఆమె ఆలపించిన గీతాల్లో ‘‘మేఘమా దేహమా..’’ పాటలో ఆమె స్వరంలో పలికిన ఆర్ద్రత.. ‘‘ఆకాశం ఏనాటిదో.. ఆనందం ఆనాటిది..’’ అని సాగే గీతంలో ఆమె హృదయం నుంచి ఉప్పొంగిన ప్రేమ తత్వం.. ‘‘వెన్నెల్లో గోదావరి అందం..’’ పాటలో పలికించిన ఆవేదన.. ‘‘తొలిసారి మిమ్మల్ని చూసింది..’’ పాటలో కనబర్చిన అల్లరి సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ఏ తరం కథానాయికలకైనా సరిపోయేట్లు తన స్వరాన్ని సవరించుకోవడం జానకమ్మకి తెలిసినట్లు మరెవరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. అదీ ఆమె ప్రత్యేకత. వయసు మీద పడుతున్నా ఆ ప్రభావం తన వాణిపై పడకుండా 82 ఏళ్ల వయసులోనూ తన సుమధురమైన స్వరాలతో సినీ, సంగీత ప్రియులను తన గానామృతంలో ఓలలాడిస్తూనే ఉంది. నేడు ఆ కోకిలమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే కోకిలమ్మ జానకమ్మ….