అతడి గొంతులో ఏదో మాయ ఉంది. తెలియని మత్తు ఉంది. మనసును తాకి.. గుండెను హత్తుకొని.. హృదయాన్ని మెలిపెట్టే మహత్తుంది. అతడి గొంతులోంచి ఉవ్వెత్తున ఎగసిపడే శ్రావ్యత.. ఎందరో శ్రోతలకి వైబ్రేషన్ అవుతుంది . ఆ పెక్యులర్ వాయిస్ భాషలకు అతీతంగా.. ఎందరినో వెంటాడుతూ ఉంటుంది. ఆ పాటగాడి పేరు సిధ్ శ్రీరామ్. నిజంగానే ఎవరో సంగీత సిద్ధుడు తన శ్రావ్యమైన గొంతుతో గంధర్వ గానం చేస్తున్నట్టు .. అందరినీ సమ్మోహితుల్ని చేస్తున్నట్టే అనిపిస్తుంది. ప్రస్తుతం మన భారతీయ తెరకు సరికొత్త సంచలనం ఈ ఆ బాల గోపాల శ్రీరాముడు.
1990 మే 19న చెన్నైలో జన్మించాడు సిధ్ శ్రీరామ్. తల్లిదండ్రులతో కాలిఫోర్నియాలో పెరిగాడు. తల్లి కర్నాటక సంగీత విద్వాంసురాలు అవడంతో .. అతగాడికి చిన్నప్పటినుంచీ సంగీతం అబ్బింది. అక్కడే మ్యూజిక్ ప్రొడక్షన్ అండ్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేశాడు. తరచుగా ఇండియా వచ్చి.. కర్నాటక సంగీత కచేరీలు చేసేవాడు. మణిరత్నం కడల్ సినిమాలోని ఒక పాటతో గాయకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. అతడి వాయిస్ కు ఫిదా అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రహమాన్ అతడిని బాగా ప్రోత్సహించాడు. అక్కడ నుంచి ఐ, నానుమ్ రౌడీ దాన్, 24 లాంటి ఎన్నో సినిమాల్లో అతడి పాటలు .. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. అలాగే అవే సినిమాల తెలుగు వెర్షన్స్ లో సిధ్ శ్రీరామ్ వాయిస్ లోని వైవిధ్యత తెలుగువారినీ ఆకట్టుకుంది. ఇక గీతగోవిందం సినిమాలోని అతడు పాడిన రెండు పాటలతో .. సంచలనంగా మారాడు. ఇక అక్కడినుంచి టాక్సీవాలా, ఏబీసీడీ, డియర్ కామ్రేడ్, హుషారు, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా,.. ఇప్పుడు కొత్తగా ఓరేయ్ బుజ్జీ చిత్రాల్లోని పాటలతో యువతను ఉర్రూతలూపుతున్నాడు. ప్రస్తుతం అతడి పాట .. సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. తమ సినిమాలో కనీసం ఒక్క సిధ్ శ్రీరామ్ పాటైనా ఉండాలని నిర్మాతలు భావిస్తున్నారు. నేడు సిధ్ శ్రీరామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీవాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే సిధ్ శ్రీరామ్.