Siddharth – Adithi : బొమ్మరిల్లు బాయ్ సిద్ధార్థ్, సౌత్ బ్యూటీ అదితి రావు హైదరీ తమ ప్రేమను పెళ్లితో ముడి వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ జంట చాలా కాలంగా ప్రేమలో ఉన్నప్పటికీ, తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచారు. అయితే ఇటీవల వీరి నిశ్చితార్థం అయింది. అనంతరం ఇప్పుడు పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.
వీరి వివాహం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వైభవంగా జరిగింది. ఈ ఆలయం వీరి కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది కావడంతో ఈ ఆలయంలోనే నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లికి అదితి గోల్డెన్ జరీ వర్క్‌తో రూపొందించిన అద్భుతమైన లెహంగాను ధరించగా, సిద్ధార్థ్ సాంప్రదాయ పైజమా, కుర్తాలో స్టైలిష్ గా కనిపించారు.
తమ పెళ్లి తర్వాత అదితి తన సోషల్ మీడియా అకౌంట్లో పెళ్లి ఫోటోలను పంచుకుంటూ తన భర్త సిద్ధార్థ్ పై ప్రేమను వ్యక్తం చేసింది. “నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే.. నా నక్షత్రాలన్నీ నువ్వే” అంటూ తన భావాన్ని వ్యక్తం చేసిన ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ జంటను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.
అదితి ఒక ఇంటర్వ్యూలో తన నాన్నమ్మ ప్రారంభించిన స్కూల్లోనే సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని, అది తనకు ప్రత్యేకమైన క్షణంగా నిలిచిందని పేర్కొంది. వీరి ప్రేమ కథ సినిమా స్క్రిప్ట్ లాంటిదే అని చెప్పవచ్చు. ఇటీవల ఈ ఇద్దరు కలిసి మహా సముద్రం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిద్ధార్థ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ జంట తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడంతో, అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.