Shruthi Haasan : యాక్టింగ్ అండ్ మ్యూజిక్ మాత్రమే కాదు, కథలను విభిన్న రకాలుగా చెప్పడం కూడా తనకు చాలా ఇష్టమని అందాల తార శ్రుతి హాసన్ అంటోంది. భావోద్వేగాలు, అనుభవాల లోతుల్లోకి తీసుకెళ్లేది కథలే అని ఈమె నమ్ముతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి, కథల పట్ల తన అభిరుచి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
“అద్భుతమైన కథలను అత్యంత ప్రామాణికమైన రీతిలో చెప్పడానికి సోషల్ మీడియా నాకు ఒక వేదికగా అనిపిస్తుంది. సంగీతం, కవితలు, వీడియోలు… ఇలా ఏ రూపంలోనైనా కథా సాహిత్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు” అని శ్రుతి అభిప్రాయ పడింది. తన తొలి హాలీవుడ్ చిత్రం ‘ది ఐ’ గురించి మాట్లాడుతూ… “నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది తెలుగు చిత్ర పరిశ్రమే. నా తొలి తెలుగు సినిమా చేసేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో ‘ది ఐ’ పట్ల కూడా అంతే ఆసక్తి ఉండేది. మహిళా నేతృత్వంలో తెరకెక్కిన చిత్రం కాబట్టి ఈ ప్రాజెక్ట్ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే” అని ఈమె తెలిపింది.
“చిత్ర పరిశ్రమలోకి రావాలనేది నా ఉద్దేశం కాదు. కానీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నా చుట్టూ సినీ ప్రపంచమే కనిపించేది. సినిమా కంటే ముందు చిన్నప్పటి నుంచి సంగీతం నా జీవితంలో భాగమైంది. సంగీతం, సినిమా.. ఈ రెండూ ప్రస్తుతం నాకు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఈ రెండు కళలను సమానంగా భావిస్తాను” అంటూ శ్రుతి ముగించింది. ప్రస్తుతం ‘డెకాయిట్’, ‘చెన్నై స్టోరీ’ లాంటి చిత్రాలతో బిజీగా ఉంది శ్రుతి హాసన్.