టీవీలో యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాడు.. ఆ తర్వాత నటుడిగా.. సహనటుడిగా.. పలు చిత్రాల్లో అభినయించాడు. తన టాలెంట్ తో పదిమందినీ మెప్పించాడు. ఆపై  హీరో అయ్యాడు .. నిర్మాతగానూ ఎదిగాడు. ఇప్పుడు సోషల్ రిఫార్మర్ గా అవసరం మేరకు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆయన పేరు శివాజీ.

‘ప్రేమంటే ఇదేరా’, ‘బ్యాచిలర్స్‌’, ‘ప్రియమైన నీకు’, ‘ఖుషీ’, ‘చిరంజీవులు’, ‘శివరామరాజు’ తదితర చిత్రాల్లో శివాజీ పోషించిన పాత్రలకి మంచి పేరొచ్చింది. కొన్ని చిత్రాల్లో కథానాయకులకి సమానమైన పాత్రలు చేసి పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. ‘దిల్‌’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘పిజ్జా’ చిత్రాల్లో కథానాయకుడి పాత్రలకి డబ్బింగ్‌ చెప్పారు శివాజీ. అదే సమయంలో ఆయన్ని కథానాయక పాత్రలు కూడా వరించాయి. అందులో భాగంగా చేసిన ‘మిస్సమ్మ’ చిత్రంతో ఆయన మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నాడు శివాజీ. ఆ తరువాత వరుసగా కథానాయక పాత్రల్లో మెరిశాడు. ‘అమ్మాయి బాగుంది, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజాకృష్ణమూర్తి’, ‘మిస్టర్‌ ఎర్రబాబు’, ‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘సత్యభామ’, ‘స్టేట్‌రౌడీ’ తదితర చిత్రాలతో కథానాయకుడిగా శివాజీ ఆకట్టుకున్నాడు. ‘మంత్ర’తో మరో విజయాన్ని సొంతం చేసుకొన్న ఆయన ఆ తర్వాత అనుకొన్న ఫలితాలు రాలేదు. దాంతో తన కెరీర్‌ని నిలబెట్టుకొనేందుకు, నిర్మాతగా మారి ‘తాజ్‌మహల్‌’ తెరకెక్కించాడు. కానీ కలిసిరాలేదు.  ‘అయ్యారే’, ‘కమలతో నా ప్రయాణం’, ‘బూచమ్మ బూచాడు’ తదితర మంచి చిత్రాలు చేసినా అవి ప్రేక్షకులకి చేరలేకపోయాయి.  ప్రస్తుతం శివాజీ సినిమాలు తగ్గించి.. సామాజిక సమస్యలపై దృష్టి సారించి .. పరిష్కారాల దిశగా  తన పయనాన్ని కొనసాగిస్తున్నాడు.  నేడు  శివాజీ పుట్టినరోజు. ఈ సందర్భంగా  ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.  

హ్యాపీ బర్త్ డే శివాజీ 

 

 

Leave a comment

error: Content is protected !!