అందగాడు… ఆజానుబాహుడు.. నటనలో వైవిధ్యత.. నడకలో హుందాతనం.. నవ్వులో ఆత్మీయత.. నిర్మలమైన మనసు.. నిష్కళంకమైన హృదయం.. ఇవన్నీ ఒకే మనిషిలో ఉంటే ఆయన శరత్ బాబు. హీరోగానూ, విలన్ గానూ, కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ ఒకప్పుడు దక్షిణాది తెరపై తన విలక్షణీయత చూపిన ఆయన.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషలలో నటించి మెప్పించారు. సుమారు 37 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలలో వివిధ పాత్రలు పోషిస్తున్నారు. రెండు వందల సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే, ఎక్కువగా ఆయన సపోర్టింగ్ రోల్స్ లోనే నటించారు. శివాజీ గణేశన్, రజినీకాంత్, కమల్ హాసన్, మరియు చిరంజీవి లాంటి స్టార్ల సినిమాలలో సపోర్టింగ్ సహాయక పాత్రలు పోషించి మంచి మార్కులు కొట్టేశారు. అంతేకాదు శరత్ బాబు కు సినిమాల్లో పాత్రల పరంగా త్యాగరాజు అనే పేరు కూడా ఉంది. తాను ప్రేమించిన అమ్మాయిని .. ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో కలిపే త్యాగ గుణం కలిగిన పాత్రలు ఆయన ఎన్నిటినో పోషించారు.
శరత్ బాబు పేరు వినగానే మనకు ఎన్నో సినిమా పేర్లు వెంటనే గుర్తుకువస్తాయి. ‘తాయారమ్మ బంగారయ్య’, ‘మూడు ముళ్ల బంధం’, ‘సీతాకోక చిలుక’, ‘యమకింకరుడు’, ‘సాగర సంగమం’, ‘సితార’, ‘కాంచన గంగ’, ‘అగ్ని గుండెం’, ‘అన్వేషణ’, ‘స్వాతి ముత్యం’, ‘జీవన పోరాటం’, ‘డబ్బెవరికి చేదు’, అభినందన, సంకీర్తన, శిక్ష, ఓ భార్యకథ లాంటి ఎన్నో సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు శరత్ బాబు. బాపు, భారతీరాజా, కె.బాలచందర్ , కె.విశ్వనాథ్, వంశీ, క్రాంతి కుమార్, లాంటి ఎంతోమంది అగ్రదర్శకుల సినిమాలలో ఎన్నో రకాల పాత్రల్లో నటించి విలక్షణమైన నటుడుగా పేరు సంపాదించుకొన్నారు శరత్ బాబు. అంతేకాదు.. ఆయన నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా, ఉత్తమ సహాయ నటుడిగా ఎనిమిది సార్లు నంది అవార్డు అందుకొన్న ఘనత శరత్ బాబుకే దక్కుతుంది. నేడు శరత్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.