అందానికి అందం, విశాలమైన కళ్ళు, చక్కని శరీరం, ఒడ్డు, పొడుగు, తాకితే కందిపోయే మేనిఛాయ.. వరాలుగా పొందిన నటుడు హరనాథ్. ఎన్టీఆర్, ఎఎన్నార్ తర్వాత సినీరంగానికి దొరికిన గొప్ప హీరో. ఆయన పూర్తి పేరు బుద్దరాజు వెంకట అప్పల హరనాథ రాజు. తూర్పుగోదావరిజిల్లాలోని రాపర్తిలో సంపన్న భూస్వాముల కుటుంబంలో పుట్టారు ఆయన . ప్రీ యూనివర్సిటీ వరకు మద్రాసులో చదివారు. డిగ్రీ చదివే రోజుల్లో కల్చరల్ కార్యదర్శిగా కాకినాడలో ఒక వెలుగు వెలిగారు. నాటకాలు ఆడుతూ మద్రాసు చేరిన హరనాథ్.. నాటి ప్రముఖ నటుడు ముక్కామల కంటపడటంతో ‘ఋష్యశృంగ’ సినిమాలో అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్లో తీసిన తొలిసినిమా ‘మా ఇంటి మహాలక్ష్మిలో హరనాథ్ హీరో. అంటే పాతికేళ్ళు నిండకుండానే ఒక గుర్తింపు వచ్చింది. ఆపై సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించారు హరనాథ్. యన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణంలో రాముడిగానూ, భీష్మలో కృష్ణుడు గానూ నటించి మెప్పించారు .
హరనాథ్ అందాన్ని, రొమాన్స్ పలికించే తీరును చూసి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. జమున-హరనాథ్ హిట్ పెయిర్ అయ్యారు. 1960ల్లో హరనాథ్ అందాల హీరో. అయితే ఆయన తాగుడు అలవాటు, షూటింగ్ లకు సమయానికి రాకపోవటం.. నిర్మాతలకు, దర్శకులకు తలనొప్పిగా మారింది. అందుకే కొత్తగా పరి శ్రమలో హీరోలుగా నిలదొక్కుకుంటున్న కృష్ణ , శోభన్ బాబులను ఎంపిక చేసుకొనేవారు. 1970 ప్రారంభంలోనే హరనాథ్ కు సినిమాలు తగ్గాయి. హీరో పాత్రలు ఆగిపోయాయి. ఆదాయం లేదు. అలవాట్లు మార్చుకోలేదు. ఒకనాటి పెద్దకార్లు వరసగా మాయమయ్యాయి. మంచి డ్రస్లు లేవు. పదేళ్ళ తర్వాత తిరిగి నాలుగు సినిమాలలో కనిపించినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. 1984లో వచ్చిన ‘నాగు’ సినిమాలో చిరంజీవికి తండ్రిగా డైలాగ్ లేని పాత్రలో చివరిగా కనిపించారు హరనాథ్. నేడు హరనాథ్ జయంతి. ఈ సందర్భంగా ఆ అందాల నటుడికి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.